
డీర్ పార్కు సిబ్బందికి శిక్షణ
పాల్వచరూరల్: కిన్నెరసాని డీర్ పార్కు సిబ్బందికి హైదరాబాద్‌లోని నెహ్రు జులాజికల్ పార్కులో సోమవారం ఒకరోజు శిక్షణ ఇచ్చారు. జింకల ఫోషణ, రెస్క్యూ విధానంపై జూపార్కు డైరెక్టర్, ఇతర అధికారులు అవగాహన కల్పించారు. యానంబైల్ సెక్షన్ ఆఫీసర్ కిషన్, బీట్ ఆఫీసర్ నరేష్, డీర్ పార్కు వాచర్లు ఇబ్రహీం, కళ్యాణ్ శిక్షణకు వెళ్లిన వారిలో ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
చండ్రుగొండ: రోడ్డు ప్రమాదంలో సోమవారం ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గానుగపాడుకు చెందిన మొగలిపువ్వు నాగరాజు, తాటికూరి ఎల్లయ్య ద్విచక్రవాహనంపై సుజాతనగర్ నుంచి గానుగపాడుకు వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో అన్నరంతండా వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను చండ్రుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని అంబులెన్స్ ద్వారా మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో
జైలు శిక్ష
ఇల్లెందు: మద్యం తాగి వాహనం నడిపిన మండలంలోని మస్సివాగు గ్రామానికి చెందిన బోడ మల్సూర్‌కు ఇల్లెందు న్యాయమూర్తి సోమవారం నాలుగు రోజుల జైలు శిక్ష , రూ.500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఇటీవల పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా మద్యం తాగి వాహనం నడుపుతున్న మల్సూర్ పట్టుబడ్డాడు. సీఐ సురేష్ కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి కీర్తిచంద్రికరెడ్డి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఏజెన్సీలో వాహన తనిఖీలు
ఇల్లెందురూరల్: మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో మండలంలోని ఇల్లెందు–గుండాల ప్రధాన రహదారిపై కొమరారం పోలీసులు సోమవారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాహనదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వారి వివరాలు నమోదు చేసుకున్నారు. తనిఖీల్లో కొమరారం ఎస్సై నాగుల్‌మీరా, సిబ్బంది పాల్గొన్నారు.