
ప్రమాదంలో వ్యక్తి మృతి
చుంచుపల్లి: చుంచుపల్లి విద్యానగర్ బైపాస్ వద్ద సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నారాయణపురం మండలం ఊకొండి గ్రామానికి చెందిన పోగుల సుభాష్ (42) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఇంట్లో డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ప్రమాదానికి గురై మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి సోదరి కవిత ఫిర్యాదుతో చుంచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి..
జూలూరుపాడు: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు వల్లపిన్ని సత్యనారాయణ(65) సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం.. సత్యనారాయణ ఇంటి ఆవరణలో నూతనంగా తెచ్చిన వాటర్‌స్ప్రే మిషన్‌తో ట్రాక్టర్‌ను కడిగే ప్రయత్నం చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం తర్వాత సత్యనారాయణ దంపతులు హైదరాబాద్‌లో ఉన్న కుమారుడి వద్దకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోనే ఈ ఘటన జరగడంతో కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడికి భార్య అరుణ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని సొసైటీ మాజీ చైర్మన్ పోలుదాసు క్రిష్ణమూర్తి, నున్నా రోశరావు, కాంగ్రెస్ నాయకులు నున్నా కృష్ణయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చండ్ర నరేంద్రకుమార్, మండల సహాయ కార్యదర్శి ఎస్కే నాగుల్‌మీరా, యల్లంకి మధు, గార్లపాటి వీరభద్రం సందర్శించి, సంతాపం తెలిపారు.
అన్నదమ్ముల ఘర్షణ
పాల్వంచరూరల్: తల్లిదండ్రుల ఇంటి స్థలం పంపకం విషయంలో అన్నదమ్ముల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కేశవాపురం గ్రామానికి చెందిన మాళోత్ వీరన్న, బాహుసింగ్ అన్నదమ్ములు. ఇంటి స్థలం విషయంలో గొడవపడి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకోగా, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.