
సుత్తితో కొట్టి వ్యక్తి హత్య
కొత్తగూడెంఅర్బన్: తలపై సుత్తితో ఓ వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన కొత్తగూడెంలో సంచలనంగా మారింది. టిఫిన్ తింటున్న సమయంలో అకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడి దారుణానికి పాల్పడ్డాడు. త్రీటౌన్ పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గణేష్‌బస్తీకి చెందిన గుబ్బల రాంమోహన్‌రావు సింగరేణి రిటైర్డ్ కార్మికుడు. ఆరు నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందగా, గణేష్‌బస్తీలో ఇంటిని కొనుగోలు చేసి నివాసముంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రాంమోహన్‌రావు(62), భార్య సావిత్రిలు టిఫిన్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి చేతిలో సుత్తి పట్టుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. దీంతో భయాందోళన చెందిన దంపతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తప్పించుకునే ప్రయత్నంలో రాంమోహన్‌రావు ఇంటి బయటకు రావడంతో అతని తలపై సుత్తితో కొట్టి అతిదారుణంగా హత్య చేశాడు. నిందితుడు చుట్టుపక్కల వారిని కూడా కొంతదూరం వరకు పరుగెత్తించి ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ, వన్, టూ, త్రీటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడు రామవరం వైపు వెళ్లినట్లు గుర్తించారు. మృతుడు రాంమోహన్‌రావుకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు, భార్య సావిత్రి ఉన్నారు. రిటైర్‌మెంట్ అనంతరం కుమారుడికి సింగరేణి ఉద్యోగం ఇచ్చాడు. కాగా రాంమోహన్‌రావు కొనుగోలు చేసిన ఇల్లు వివాదంలో ఉండటం లేదా వివాహేతర సంబంధమే కారణమనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు