
మమ్మేలు తల్లీ..
పెద్దమ్మతల్లి ఆలయానికి ఉత్సవ శోభ
శ్రీ దేవీ శరన్నవరాత్రులకు
ముస్తాబైన గుడి
నేటి నుంచి వచ్చే నెల
2వ తేదీ వరకు వేడుకలు
పాల్వంచరూరల్: భక్తులు కోరిన కోరికలు తీర్చే పెద్దమ్మతల్లి (శ్రీకనకదుర్గ)ఆలయం శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు ముస్తాబైంది. విద్యుత్‌దీపాల అలంకరణతో శోభిల్లుతోంది. ఏటా దసరా పండుగకు ముందు ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. సోమవారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు వేడుకలు జరపనున్నారు. ఈ సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తారు. మొక్కులు తీర్చుకుంటారు. తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా వేద పండితులను తీసుకొచ్చి అమ్మవారికి పూజలు జరిపిస్తారు. ఉత్సవాలను పురస్కరించుకుని రోజూ సహస్ర నామార్చన, కుంకుమార్చనలు, చండీహోమం, శ్రీచక్రార్చనలు, ఇతర హోమాలు, అమ్మవారికి దర్బారు సేవ, నవదుర్గ అలంకారాలతో కొలువు నిర్వహించనున్నారు.
కలశస్థాపనతో వేడుకలు ప్రారంభం
22న ఉదయం 9.30 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనం, అఖండ దీపారాధన, దీక్షాధారణ చేయనున్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరా వు దంపతుల కలశస్థాపనతో శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు క్యూలైన్లు, నీరు, నీడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆలయానికి రంగులువేశారు. వాల్‌పోస్టర్లు, కరపత్రాలు, ప్రచార రథం ద్వారా ప్రచారం చేశారు. ఆలయం చుట్టూ లైటింగ్, పలుచోట్ల హోర్డింగులు ఏర్పాటు చేశారు. వేడుకల సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచీ భక్తులు హాజరుకానున్నారు. దీంతో పదిరోజులపాటు ఆలయ ప్రాగంణం భక్తులతో కిటకిటలాడనుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈఓ రజనీకుమారి, ఆలయ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తెలిపారు.
అమ్మవారి అలంకారాలు..
వేడుకలను పురస్కరించుకుని అమ్మవారు దశ రూపాల్లో దర్శనమిస్తారని, ఈసారి ఒకరోజు ఎక్కువగా ఉత్సవాలు జరుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. మొదటి రోజున 22న శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. 23న మంగళ గౌరిదేవీ, 24న అన్నపూర్ణదేవి, 25న శ్రీగాయత్రీదేవి, 26న మహాలక్ష్మి దేవి, 27న శ్రీలలితా పరమేశ్వరీదేవి, 28న శ్రీచండీ దేవి, 29న శ్రీసరస్వతీదేవి, 30న శ్రీ దుర్గాదేవి, అక్టోబర్ 1న మహిషాసుర మర్ధిని, 2న శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ ఏడాది అధిక మాసం రావడంతో తిథుల్లో హెచ్చు తగ్గులు వచ్చాయి. దీంతో ఈసారి నవరాత్రి వేడుకలు ఒకరోజు ఎక్కువగా జరుగుతాయి. రెండేళ్లకో సారి ఇలా జరుగుతుంది. గతంలో ఒకసారి 20 రోజు ల పాటు వేడుకలు జరిగిన సందర్భం కూడా ఉంది.
– పద్మనాభశర్మ, వేదపండితుడు
ఆలయంలో తొమ్మిది రోజులపాటు శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు వై భంగా జరుగుతాయి. చివరి రోజు సామూహిక రమాసహిత సత్యనారాయణ వ్రత పూజలు, అన్నదానం నిర్వహిస్తాం.
–ఎన్.రజనీకుమారి, పెద్దమ్మగుడి ఈఓ

మమ్మేలు తల్లీ..

మమ్మేలు తల్లీ..

మమ్మేలు తల్లీ..