
భద్రగిరిలో రేపటి నుంచి..
● భద్రాచలం రామాలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ● తొమ్మిదిరోజులపాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి శరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. మంగళవారం నుంచి తొమ్మిదిరోజులపాటు మహా లక్ష్మి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమివ్వనున్నా రు. తొమ్మిది రోజుల అలంకరణ అనంతరం విజ యదశమి రోజున దసరామండపంలో శమీ, ఆయుధ పూజ, శ్రీ రామలీలా మహోత్సవాలను ఘనంగా జరపనున్నారు. ప్రతీ రోజు శ్రీలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అభిషేకం, చిత్రకూట మండపంలో సామూహిక శ్రీ రామాయణ పారాయణం, మధ్యాహ్నం శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిఽధిలో సామూహిక కుంకుమార్చన, సాయంత్రం చిత్రకూట మండపంలో శ్రీరామాయణ ప్రవచనం, తిరువీధి సేవ, ఇతర ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. మంగళవారం ఆదిలక్ష్మిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 24న సంతానలక్ష్మి, 25న గజలక్ష్మి, 26న ధనలక్ష్మి, 27న ధాన్యలక్ష్మి, 28న విజయలక్ష్మి, 29న ఐశ్వర్య లక్ష్మి, 30న వీరలక్ష్మి, అక్టోబర్ 1న మహాలక్ష్మిగా అమ్మవారిని అలంకరించనున్నారు. 2న విజయదశమి సందర్భంగా విజయోత్సవం, శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీలా మహోత్సవం నిర్వహించనున్నారు.
ఆదిలక్ష్మి అలంకరణ విశిష్టత
శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి అమ్మవారు తొలిరోజు ఆదిలక్ష్మిగా దర్శనమివ్వనున్నారు. భగవంతుని గుర్తించడానికే ఆలంబమైన లక్ష్మీ తత్వాన్నే ఆదిలక్ష్మి అంటారని, ఆ అమ్మ వారి వల్లనే వేదవేద్యుని గుర్తించగలిగారని పండితులు చెబుతున్నారు. చతుర్భుజాలతో, పై రెండు చేతుల్లో పద్మాలను ధరించి, వరద–అభయ హస్తాలతో విరాజిల్లుతున్న ఆదిలక్ష్మి అమ్మవారు తొలి అలంకరణగా రామాలయంలో దర్శనమివ్వనున్నారు.