
మరక మంచిదే..!
బదిలీలతోనే సరి
● ఏసీబీకి దొరికినా కఠిన చర్యలు కరువు ● బదిలీ లేదా పాత స్థానంలోనే పోస్టింగ్ ● ఫలితంగా రెవెన్యూ శాఖలో యథావిధిగా దందా
సత్తుపల్లి: ఏసీబీ అధికారులకు పట్టుబడడం.. ఆపై కొన్నాళ్లకు మరోచోట పోస్టింగ్ వస్తుండడంతో రెవెన్యూ శాఖలోని కొందరు ఉద్యోగులకు ‘మరక మంచిదే’ అన్న చందంలా మారింది. అవినీతి ఉద్యోగులపై కఠిన చర్యలేమి లేకపవడంతో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా యథాతధంగా దందా సాగించడం రివాజులా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 2019 మార్చిలో గంగారం వీఆర్వోగా పనిచేసిన పద్ధ వెంగళరావు రైతు దాసరి మాధవరెడ్డి నుంచి రూ.18వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆ వెంటనే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. కానీ వెంగళరావు అయ్యగారిపేట జీపీఓగా సత్తుపల్లి తహసీల్‌లోనే ఇటీవల మళ్లీ చేరడం గమనార్హం. ఇలా రెవెన్యూశాఖలో అవినీతి కేసుల్లో ఏసీబీకి పట్టుబడిన వారిలో ఎక్కువ మంది పాత స్థానాల్లో పోస్టింగ్ తెచ్చుకుంటుండడంతో గతంలో ఫిర్యాదు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు.
మాకేంటి భయం?
రెవెన్యూశాఖలో కొందరు ఉద్యోగుల పనితీరు ఉన్నతాధికారులకు తలనొప్పి తీసుకొస్తుందనే ఆరోపణలున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో ఒకరిదిద్దరు ఆర్‌ఐలు ఎలాంటి భయం లేకుండా ఫోన్‌పే ద్వారా డబ్బు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై అధికార పార్టీలోని ఓ ముఖ్యనేత సదరు ఆర్‌ఐలను పిలిచి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. అయినా వారిలో మార్పు రాకపోగా మరింత విచ్చలవిడిగా డబ్బులు లాగుతున్నట్లు తెలుస్తోంది.
అంతా ఆపరేటర్ల చేతుల్లోనే..
భూమి రిజిస్ట్రేషన్లుకు వచ్చే రైతుల నుంచి నేరుగా అధికారులు డబ్బు తీసుకోవడం లేదని సమాచారం. కంప్యూటర్ ఆపరేటర్లను మధ్యవర్తులుగా నియమించుకుని వారితోనే బేరసారాలు సాగించడంతో పాటు డబ్బు వసూళ్లు కూడా వారి చేతుల మీదుగానే నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఏసీబీ దాడి జరిగినా నేరుగా పట్టుబడే అవకాశం లేకపోవడంతో అధికారులు ఈ మార్గం ఎంచుకున్నట్లు సమాచారం. దీన్ని అదునుగా తీసుకుని కొన్ని తహసీల్దార్ కార్యాలయాల్లోని ఆపరేటర్లు అధికారులు చేయలేని పనులను సైతం అవలీలగా చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నట్లు తెలిసింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలైన వీరి ఆగడాలపై ఫిర్యాదులు వస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం కారణాలు అంతుపట్టక జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు, ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వచ్చినా, ఏసీబీకి పట్టుబడినా బదిలీతోనే సరిపెడుతుండడంతో వారిలో భయం ఉండడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇంకొందరికై తే అదే మండలంలో పోస్టింగ్ దక్కుతుండడంతో మళ్లీ దందా మొదలుపెట్టేస్తున్నారని సమాచారం. ఇటీవల జరిగిన ఆర్‌ఐల బదిలీ వ్యవహారం ఇందుకు నిదర్శనంగా నిలవగా... కంప్యూటర్ ఆపరేటర్లను బదిలీ చేసినా వారి వ్యవహార శైలిలో మార్పు రావటం లేదనే విమర్శలున్నాయి.