
వాటా.. ఎంతంటా..?
● లాభాల్లో వాటా ప్రకటించడంపై యాజమాన్యం దోబూచులాట ● 35 శాతం చెల్లించాలని కార్మికులు, సంఘాల నేతల డిమాండ్
సింగరేణి(కొత్తగూడెం): ఈ ఏడాది సింగరేణి యాజమాన్యం లాభాల్లో వాటాను ప్రకటించలేదు. కనీసం లాభాలను కూడా ప్రకటించలేదు. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాలను ప్రకటించి, గతేడాది కార్మికులకు చెల్లించిన వాటా 33 శాతానికి మరో 2 శాతం పెంచి 35 శాతాన్ని ఇవ్వాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. ఏటా దసరా పండుగకు 10 రోజుల ముందు లాభాలు ప్రకటించి, ఏరోజు చెల్లిస్తారో తేదీని ప్రక టించేది. కానీ, ఈ సారి లాభాల ప్రకటన లేదు. శాతం ఊసే లేదు. అయితే, సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగటంతో రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటన చేయాలని యాజమాన్యం భావిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఏమో లాభాల వాటాపై దృష్టి సారించకపోవడంతో కార్మిక వర్గం ఆందోళన చెందుతోంది.
1998 నుంచి లాభాల్లో వాటా
సింగరేణి సంస్థ ఆర్థిక సంవత్సరంలో సాధించిన బొగ్గు ఉత్పత్తి, వాటి అమ్మకాలు టర్నోవర్‌పై ఏటా కంపెనీ ఆర్జించిన లాభాల్లో కొంతశాతం వాటాను 1998 నుంచి కార్మికులకు చెల్లిస్తోంది. గతేడాది కంపెనీ సాధించిన లాభాల్లో 33 శాతం వాటాను కార్మికులకు చెల్లించింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు మాసాలు అయినప్పటికీ ఇంకా టర్నోవర్‌ను కానీ, లాభాలను కానీ ప్రకటించలేదు. యాజమాన్యం లాభాల వాటాను ఎప్పుడు ప్రకటిస్తుందోనని కార్మికులు ఎదురు చూస్తున్నారు.
ఈసారి ఎంతో..?
గుర్తింపు కార్మిక సంఘమైన ఏఐటీయూసీ గతంలో బీఆర్‌ఎస్ కంటే (2022–23)లో 32 శాతం చెల్లిస్తే, తాము అధికంగా ఇప్పిస్తామని చెప్పి 2023–24లో 33 శాతం మాత్రమే చెల్లించేలా చేసింది. అయితే ఈసారి పాత 33 శాతమే చెల్లిస్తుందా? లేక ఎంతోకొంత పెంచి ఇస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.