
97 మందికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.41 లక్షలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సిఫార్సుతో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో నాయకులు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 97 మందికి రూ.41 లక్షల సాయం మంజూరు కాగా, పీసీసీ ప్రధానకార్యదర్శి మద్దినేని స్వర్ణ కుమారి, నాయకులు తుంబూరు దయాకర్‌రెడ్డి, కొప్పుల చంద్రశేఖర్ లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. వివిధ మండలాల నాయ కులు బాలాజీనాయక్, స్వర్ణ నరేందర్, వడ్డెబోయిన నరసింహారావు, ఉమ్మినేని కృష్ణ, ఉప్పునూతల నాగేశ్వరరావు, ఒంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, అర్వపల్లి శివ, బోడా శ్రావణ్, కాంపాటి వెంకన్న, గౌస్, విప్లవ్‌కుమార్, గురుమూర్తి, వేణు, రంజిత్ పాల్గొన్నారు.
బాలిక ప్రసవం
ఖమ్మంవైద్యవిభాగం/ఖమ్మంక్రైం: బాలిక ప్రసవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని తండాకు చెందిన సదరు బాలిక గర్భం దాల్చగా, నెలలు నిండడంతో కుటుంబీకులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం చేర్పించినట్లు సమాచారం. అక్కడ బాలిక ఆడశిశువుకు జన్మనివ్వగా, పాపను తీసుకెళ్లేందుకు వారు నిరాకరించారని తెలిసింది. దీంతో శిశువును అమ్మేందుకు ఆస్పత్రి నర్సు ద్వారా బేరసారాలు సాగించినట్లు సమాచారం. విషయం బయటకు పొక్కడంతో ఐసీడీఎస్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు పోలీసులు విచారణ చేపట్టారు. శిశువును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే, చివరకు బాలిక బంధువులే తీసుకెళ్తామని చెప్పినట్లు సమాచారం. కాగా, బాలిక గర్భానికి అదే తండాకు చెందిన యువకుడు కారణమని గుర్తించి ఖమ్మం వన్‌టౌన్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాక, మరిపెడ పోలీసుస్టేషన్‌కు బదలాయించారు. అయితే, శిశువు అమ్మకం విషయమై వివరణ కోరేందుకు బాలల సంరక్షణ అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు.
ఎలక్ట్రీషియన్‌కు కరెంట్‌షాక్
సత్తుపల్లిరూరల్: ట్రాన్స్‌ఫార్మర్ వద్ద సరఫరా నిలిపివేసేందుకు ప్రయత్నించిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌కు విద్యుదాఘాతంతో గాయాలయ్యాయి. సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన ధర్మసోత్ రామకృష్ణ ప్రైవేట్ ఎలక్ట్రీషన్‌గా పని చేస్తున్నాడు. ఓ రైతు పొలంలో మోటారు ఫ్యూజ్ పోయిందని చెప్పగా, ఆదివారం మరో వ్యక్తితో కలిసి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద సరఫరా నిలిపేందుకు ప్రయత్నించాడు. రామకృష్ణ మెడలో ఉన్న గొలుసు 33/11 కేవీ వైర్‌కు తాకగాషాక్‌తో ఆయన మెడ భాగం కాలిపోయింది. ఆయన్ను 108 ద్వారా సత్తుపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యుత్, పోలీసు అధికారులు విచారణ చేపట్టారు.