
బీటీపీఎస్‌లో అధికారుల చేతివాటం!
మణుగూరు రూరల్: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో అధికారుల తీరు ఇష్టారాజ్యంగా మారింది. మామూళ్లు ఇచ్చినవారికే టెండర్లు అప్పగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2015లో అప్పటి ఐటీడీఏ పీఓ బీటీపీఎస్ ప్రభావిత గ్రామాలైన సాంబాయిగూడెం, దమ్మక్కపేట, సీతా రాంపురం, పోతిరెడ్డిపల్లి–1,2,3 గ్రామాల్లో వీటీడీఏలు ఏర్పాటు చేశారు. ప్లాంట్‌లో ప్రారంభమయ్యే అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పనులు 100 శాతం స్థానికులకు, స్థానిక వీటీడీఏ సొసైటీలకు అప్పగించాలనే నిబంధనతో ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ప్లాంట్‌లో 150మంది వరకు సుమారు 60 కిలోమీటర్ల దూర ప్రాంతాలవారే ఉన్నారు. 2018లో స్థానిక సొసైటీ సభ్యులకే ఆర్టిజన్లుగా అవకాశం కల్పించా లని, సుమారు 300 మందికి తగ్గకుండా తీసుకోవా లని ఉత్తర్వులున్నా అమలు చేయలేదని, ఇందుకు విరుద్ధంగా ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు అవకాశాలు కల్పించారని తెలుస్తోంది. నామినేటెడ్ పనుల్లో కూడా స్థానికులకు అవకాశం కల్పించడం లేదని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫ్‌లైయాష్, యాష్‌పాండ్ టెండర్లలో ఓ అధికారి చక్రం తిప్పి ఇతర ప్రాంతానికి చెందిన ఓ కంపెనీకి రూ. 10లక్షలకు కట్టబెట్టారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే అధికారి స్క్రాప్ టెండర్ వ్యవహారంలో రూ.20లక్షలు తీసుకున్నారని, తాను గతంలో పనిచేసిన కంపెనీలోని ఓ వ్యక్తి కుటుంబానికి టెండర్ అప్పగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సంస్థ అవసరాలకు వినియోగించే కమర్షియల్ వెహికల్స్ స్థానంలో సొంత వాహనాలు తిప్పుతూ రూ. లక్షల్లో బిల్లులు డ్రా చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలపై బీటీపీఎస్ సీఈ బిచ్చన్నను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు.