
రైతుపై బీట్ ఆఫీసర్ దాడి
గుండాల: కోతుల నుంచి కాపాడుకునేందుకు చేనుకు సమీపంలో ఉన్న చెట్లు నరికిన ఓ రైతుపై అటవీశాఖ బీట్ ఆఫీసర్ భాస్కర్ దాడి చేసి గాయపర్చిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఆళ్లపల్లి మండలం చంద్రాపురం గ్రామానికి చెందిన దంపతులు గొగ్గల బుచ్చయ్య – లక్ష్మి మొక్కజొన్న చేను వద్ద కాపలాకు వెళ్లారు. చేను వద్దకు వచ్చిన కాచనపల్లి రేంజ్ వలసల బీట్ ఆఫీసర్ భాస్కర్ చెట్లు ఎందుకు నరికారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భుచ్చయ్యపై చేయి చేసుకుని గాయపర్చాడు. చేను చుట్టూ కోతుల నుంచి పంటను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న వల, విద్యుత్ ఫెన్సింగ్‌ను తొలగించాడు. విద్యుత్ మీటర్‌ను తీసుకెళ్తుండగా బుచ్చయ్య బతిమిలాడగా.. చేయి చేసుకున్నాడు. అసభ్యంగా దూషించినట్లు బుచ్చయ్య, లక్ష్మి ఆరోపించారు. మొక్కజొన్న చేనును కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నామని, కోతులు చెట్ల మీద ఉండటం వల్ల వాటిని చేనుకు దూరం చేయాలనే ఉద్దేశంతో చెట్లు నరికితే దాడి చేశాడని, మరోమారు చెట్లు నరకమని బతిమిలాడినా వినకుండా చేయి చేసుకున్నాడని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషయమై సెక్షన్ ఆఫీసర్ బేబీని వివరణ కోరగా దాడి చేయటం అవాస్తవమన్నారు. చెట్లు నరికినందుకు హెచ్చరించాడని తెలిపారు. ఇదిలాఉండగా రైతుపై దాడి చేసిన ఫారెస్టు బీట్ ఆఫీసర్ భాస్కర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆళ్లపల్లి మండల కాంగ్రెస్ నేతలు గొగ్గెల శ్రీను, పాయం సత్యనారాయణ కోరారు.