
కిన్నెరసాని గేటుకు మరమ్మతులు
పాల్వంచరూరల్: కిన్నెరసాని జలాశయంలో ఉన్న స్లూయిస్ వెల్ గేటుకు శుక్రవారం మరమ్మతులు నిర్వహించారు. జలాశయం లోపల వైపు ఉన్న స్లూయిస్ వెల్ గేటుకు ఐదు, ఆరు అడుగుల నీటిలోపల బోల్ట్‌లు ఊడిపోయాయి. దీంతో కొత్తగా అమర్చారు. ఈ స్లూయిస్ దిగువ భాగం నుంచి నేరుగా కేటీపీఎస్ కర్మాగారానికి నీటి సరఫరా జరుగుతుంది. మరమ్మతులను ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వరరావు, ఏడీఈ పర్యవేక్షించారు.
ఐక్యతతోనే హక్కుల పరిరక్షణ
పాల్వంచరూరల్: హక్కుల పరిరక్షణ ఉపాధ్యాయుల ఐక్యతతోనే సాధ్యమని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెద్దమ్మగుడి వద్ద శుక్రవారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షం గౌడ్, జిల్లా అధ్యక్షుడు పి.నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, అసోసియేట్ అధ్యక్షుడు భాస్కర్, రవీందర్, కళావతి తదితరులు పాల్గొన్నారు.
బంక్ నిర్మాణంపై
మధ్యంతర ఉత్తర్వులు
దమ్మపేట: దమ్మపేట బస్టాండ్ ఆవరణలో నూతన పెట్రోల్ బంక్ నిర్మాణ సంబంధమైన కట్టడాలను తదుపరి విచారణ జరిగే వరకు నిలిపివేయాలని ఆదేశిస్తూ ఈ నెల 15న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బస్టాండ్‌లో బంక్ నిర్మాణం చేపట్టడం వల్ల బస్సుల రాకపోకలకు అడ్డంకిగా మారుతుందని స్థానికులు హైకోర్టులో పిటిషన్ చేశారు. పరిశీలించిన కోర్టు, బస్టాండ్ ప్రాంగణంలో జరుగుతున్న అన్ని కట్టడాలను ఆపి, అన్ని అడ్డుంకులను తొలగించి, ప్రజా వినియోగానికి ఉపయోగపడేలా బస్టాండ్‌ను ఉంచాలని ఆదేశించింది.
యజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి
అశ్వారావుపేటరూరల్: రైతులు యజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడి పొందొచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. శుక్రవారం వ్యవసాయ కళాశాల దత్తత గ్రామమైన మండలంలోని నారాయణపురంలో ఆయిల్‌పామ్, వరి పంటలను సందర్శించారు. పంటలను పరిశీలించి, రైతులకు అవగాహన కల్పించారు. పంటల సాగు, యజమాన్య పద్దతలు, ఎరువుల వినియోగంతోపాటు సలహాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు నాగాంజలి, జంబమ్మ, కృష్ణతేజ, ఝాన్సీ రాణి, కృష్ణతేజ, ఏఈవో షాకిరా బాను, రైతులు పాల్గొన్నారు.
సొసైటీ సీఈఓపై
సస్పెన్షన్ వేటు
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట ప్రాథమిక సహకార సంఘం సీఈఓను ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేసిన ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. స్థానిక సొసైటీలో సీఈఓగా విధులు నిర్వహిస్తున్న మానేపల్లి విజయ్‌బాబు పలు అక్రమాలకు పాల్పడటంతోపాటు విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ చేస్తూ ఈ నెల 17న డీసీవో శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలిక సీఈఓగా కార్యాలయంలో స్టాఫ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న డి హేమగిరిని నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మద్యం మత్తులో
లారీ డ్రైవింగ్
● పోలీసుల అదుపులో డ్రైవర్
మణుగూరు టౌన్: మున్సిపాలిటీలోని ఓ ఇసుక క్వారీకి లోడింగ్‌కు వస్తూ మద్యం తాగి అడ్డగోలుగా లారీ నడుపుతున్న డ్రైవర్‌ను స్థానికుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన రాయలింగు శుక్రవారం మున్సిపాలిటీలోని అన్నారం ఇసుక క్వారీకి పూటుగా మద్యం తాగి లారీ నడుపుకుంటూ వెళ్తున్నాడు. ప్రమాదాలకు దారితీసే విధంగా డ్రైవింగ్ చేస్తుండటంతో స్థానికులు లారీ యూనియన్ ఆఫీస్ సమీపంలో లారీని నిలిపి వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మందుబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

కిన్నెరసాని గేటుకు మరమ్మతులు