
బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్
● తీవ్ర గాయాలతో వ్యక్తి మృతి
కొత్తగూడెంటౌన్: రుద్రంపూర్ నుంచి ద్విచక్రవాహనంపై కొత్తగూడెం వస్తున్న ఆటోడ్రైవర్ కలాతురి వేణుగోపాల్ (49)ను బొగ్గు లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం హనుమాన్‌బస్తీకి చెందిన వేణుగోపాల్ ఆటో నడుపుతున్నాడు. సాయంత్రం రుద్రంపూర్‌కు ద్విచక్రవాహనంపై వెళ్లి కూరగాయలు తీసుకుని వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వేణుగోపాల్‌ను టూటౌన్ సీఐ ప్రతాప్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రతాప్ తెలిపారు. లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.