
కొనుగోళ్లలో కొత్త రూల్..
● సీసీఐకి పత్తి విక్రయించాలంటే స్లాట్ బుకింగ్ తప్పనిసరి ● అందుకోసం ‘కాపాస్ కిసాన్’ యాప్ ఏర్పాటు ● పత్తి దిగుబడి గుర్తించేందుకు జిల్లా కమిటీలు ● ఉమ్మడి జిల్లాలో 14 జిన్నింగ్ మిల్లులు
ఖమ్మంవ్యవసాయం: పత్తికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులు పొందేందుకు సీసీఐ ఈ ఏడాది కొత్త నిబంధన విధించింది. రైతులకే మద్దతు ధర దక్కేలా నిబంధనలు కఠినం చేస్తోంది. సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయాలకు ‘కాపాస్ కిసాన్’ యాప్ రూపొందించింది. పంట సాగు చేసిన రైతులు ఈ యాప్‌లో వివరాలు నమోదు చేస్తే.. సాగు చేసినవారే సీసీఐ కేంద్రంలో పత్తి విక్రయించే అవకాశం ఉంటుంది. రైతుల ఆధార్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉండాలి. ఉమ్మడి జిల్లాలోని 9 వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 14 జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోళ్లు నిర్వహించేలా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పత్తి దిగుబడులను గుర్తించేందుకు జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయనుంది.
యాప్ ద్వారా వివరాల నమోదు
సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయానికి ‘కాపాస్ కిసాన్’ యాప్‌లో రైతులు తాము సాగుచేసిన పంట వివరా లు నమోదు చేస్తే.. బుకింగ్ నంబర్ జారీ చేస్తారు. దీని ఆధారంగా స్లాట్ బుక్ చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్ ఉన్న వారు లేదా వ్యవసాయ అధికారు లు, జిన్నింగ్ మిల్లుల వద్ద ఉన్న మార్కెటింగ్ అధికారుల ద్వారా స్లాట్ బుక్ చేయాలి. నిర్దేశించిన సమయంలో రైతులు పత్తిని జిన్నింగ్ మిల్లుకు తగిన ప్రమాణాలతో తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు.
4.46 లక్షల ఎకరాల్లో సాగు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 4,46,958 ఎకరాల్లో పత్తిసాగుచేశారు. ఖమ్మంలో 2,25,613, భద్రాద్రిలో 2,21,345 ఎకరాల్లో పత్తి సాగైంది. ఖమ్మంజిల్లాలో 27,07,356 క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలో 22,13,450 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 8 నుంచి 12 వరకు తేమశాతం కలిగిన పంటను మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. గతేడాది 8 శాతం తేమ కలిగిన పత్తికి క్వింటాకు రూ.7,521 ఇవ్వగా, ఈ ఏడాది రూ.8,110గా (రూ.589 పెరిగింది) నిర్ణయించింది. పంటను లూజ్‌గా విక్రయానికి తీసుకురావాలి.
జిల్లా కమిటీలకు బాధ్యత
పత్తి దిగుబడులను గుర్తించేందుకు జిల్లాల వారీగా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీలను ఏర్పా టు చేయనుంది. వాతావరణం, నేలలు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని పత్తి దిగుబడులను ఈ కమిటీలు గుర్తిస్తాయి. వర్షాధారంగా పత్తి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. నీటి ఆధారంగా 18 నుంచి 20 క్వింటాళ్ల వరకు వస్తుంది. జిల్లా కమిటీలు నిర్ణయించిన దిగుబడి ఆధారంగా రైతులు పంట విక్రయించుకోవాలి.
తాత్కాలిక రిజిస్ట్రేషన్లపై
నిబంధనల్లో మార్పులు
కౌలు రైతులు పంట విక్రయించేందుకు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తాత్కాలిక రిజిస్ట్రేషన్ల సౌక ర్యం కల్పించింది. అయితే, గతేడాది ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని దళారులు రైతులకు చెందాల్సిన మద్దతు ధరను కొల్లగొట్టారు. అధికారులూ సహకరించి అడ్డంగా దొరికిపోయి రాష్ట్రవ్యాప్తంగా సస్పెండ్ అయ్యారు. దీంతో ఈ ప్రక్రియలో వ్యవసాయ శాఖ అధికారుల అనుమతులు ఉంటేనే తాత్కాలిక రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించే విధంగా నిబంధనలు మార్చారు. కాగా, అక్టోబర్ నుంచి కొను గోళ్లు ప్రారంభించే అవకాశం ఉంది.
ఖమ్మం జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు
●జీఆర్‌ఆర్ ఇండస్ట్రీస్ వెంకటగిరి ఖమ్మం రూరల్.
●శ్రీసాయి బాలాజీ జిన్నింగ్ అండ్ ఆయిల్ మిల్, తల్లంపాటు ఖమ్మం రూరల్.
●అమరావతి టెక్స్‌టైల్స్ దెందుకూరు, మధిర.
●మంజీత్ కాటన్ మిల్ మాటూరు, మధిర.
●శ్రీ శివగణేశ్ కాటన్ ఇండస్ట్రీస్ ఇల్లెందులపాడు, మధిర.
●ఉషశ్రీ కాటన్, జిన్నింగ్ మిల్స్, సువర్ణాపురం, ముదిగొండ.
●స్టాప్లరిచ్ జిన్నింగ్ ఇండస్ట్రీస్, తల్లాడ.
●జీఆర్‌ఆఆర్ జిన్నింగ్ మిల్స్, పొన్నెకల్, ఖమ్మంరూరల్.
●శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్, గోల్‌తండా, తిరుమలాయపాలెం.
భద్రాద్రి జిల్లాలో సీసీఐ కేంద్రాలు
●లక్ష్మీప్రియ జిన్నింగ్ మిల్, కారేపల్లి.
●మంజిత జిన్నింగ్ మిల్స్, కొత్తగూడెం.
●అనూశ్రీ జిన్నింగ్ మిల్, బూర్గంపాడు.
●శ్రీ లక్ష్మీనరసింహ జిన్నింగ్ మిల్, బూర్గంపాడు.
●శ్రీరామా జిన్నింగ్ మిల్స్, అశ్వాపురం.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులకు దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంట విక్రయంలో కూడా రైతులు ఇబ్బందులు పడకుండా స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ప్రక్రియ రైతులకు ఎంతో మేలైంది. నిర్దేశించిన సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం.
–ఏంఏ అలీం,
జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఖమ్మం
తేమశాతం ఆధారంగా నిర్ణయించిన
పత్తి ధర (రూ.లలో)
తేమశాతం మద్దతు ధర
8 శాతం 8,110
9 శాతం 8,029
10 శాతం 7,948
11 శాతం 7,867
12 శాతం 7,786

కొనుగోళ్లలో కొత్త రూల్..