
పోడు భూములకు పట్టాలివ్వాలి
బూర్గంపాడు/భద్రాచలంటౌన్: అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయాలని, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు. బూర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్ నుంచి భద్రాచలం ఐటీడీఏ వరకు సుమారు 10 కిలోమీటర్ల శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల పత్తి పంటలను ధ్వంసం చేయడం, గిరిజన రైతులపై అటవీ అధికారులు దాడులు చేయడం మానుకోవాలని కోరారు. బూర్గంపాడు మండలంలో 2005 కంటే ముందు నుంచే గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్నారని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఇంకా 90 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలి ఇవ్వాల్సి ఉందని అన్నారు. అనంతరం కార్యాలయ పరిపాలనాధికారి సున్నం రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముక్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, రావులపల్లి రవికుమార్, మువ్వా వెంకటేశ్వర్లు, నరెడ్డి వుల్లారెడ్డి, మున్నా లక్ష్మీ కుమారి, ఈనంశెట్టి పూర్ణచంద్ర రావు, పేరాల శ్రీనివాస్, జంగం మోహన్ రావు, శ్రీనివాస్, సాధనపల్లి సతీష్, అలవాల సీతారామ రెడ్డి, సోందె కుటుంబ రావు పాల్గొన్నారు.