
ఈజీగా రాజీ!
● నేడు జాతీయ లోక్ అదాలత్ ● జిల్లాలోని 5 కోర్టుల్లో నిర్వహణ ● పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం
పెండింగ్‌లో ఉన్న, రాజీ కుదుర్చుకునేందుకు అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి. రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీపడేలా చూడాలి.
– విక్రాంత్ కుమార్ సింగ్, ఏఎస్పీ, భద్రాచలం
భద్రాచలం డివిజన్ పరిధిలోని న్యాయవాదులు, పోలీసులు, బ్యాంక్ అధికారులు జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. రాజీమార్గంతో ఎక్కువ కేసుల పరిష్కారానికి సహకరించాలి.
– శివనాయక్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, భద్రాచలం
భద్రాచలంఅర్బన్: బాధితులు ఏళ్లపాటు కోర్టులు చుట్టూ తిరగకుండా, సత్వరమే కేసులు పరిష్కరించేలా న్యాయస్థానాలు లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నాయి. లీగల్ సర్వీస్ అథారిటీ చట్టం–1987 ప్రకారం లోక్ అదాలత్‌ల ద్వారా ఏటా వేల సంఖ్యలో పెండింగ్ కేసులను పరిష్కరిస్తున్నాయి. బాధితులకు సత్వరమే న్యాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 13న జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, దమ్మపేట, ఇల్లెందు కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు.
తీర్పు అంతిమం..
రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్క రించుకోవచ్చు. ఇక్కడ ఇచ్చే తీర్పే అంతిమం. లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసుల విషయంలో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఏ న్యాయస్థానం ముందూ అప్పీల్ చేయడం కుదరదు. లోక్ అదాలత్ తీర్పుతో ఇరుపక్షాల మధ్య మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయి.
పరిష్కారం చూపే కేసులు..
క్రిమినల్, సివిల్, వివాహ, కుటుంబ తగాదా, రోడ్డు ప్రమాదం, చిట్ ఫండ్, డ్రంకెన్ డ్రైవ్, ట్రాఫిక్ తదితర కేసులను పరిష్కరించుకోవచ్చు. దొంగతనం, బ్యాంకు రికవరీ, సెల్‌ఫోన్ రికవరీ, విద్యుత్ చౌర్యం చెక్ బౌన్స్ కేసులు, కార్మిక సంబంధిత కేసులు, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు కూడా పరిష్కరించుకోవచ్చని న్యాయవాదులు చెబుతున్నారు.
లోక్ అదాలత్‌తో ప్రయోజనాలు
● సంవత్సరాల తరబడి సాగే న్యాయపరమైన చిక్కుల నుంచి విముక్తి.
● ఫార్మల్ కోర్టు విచారణ అవసరం లేకుండా సులభంగా పరిష్కారం.
● లీగల్ ఫీజులు, కోర్టు ఖర్చులు తగ్గుతాయి.
● తక్కువ ఖర్చుతో, శాంతియుతంగా వివాదాలను ముగించే అవకాశం.

ఈజీగా రాజీ!

ఈజీగా రాజీ!