
ముమ్మరంగా డిజిటల్ క్రాప్ సర్వే
గతేడాది పత్తి అమ్మకాల్లో ఏఈఓల చేతివాటం
● క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నమోదు ● అక్టోబర్ 25 వరకు నమోదుకు గడువు
బూర్గంపాడు: జిల్లా వ్యాప్తంగా పంటల నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. గతేడాది సీసీఐ పత్తి విక్రయాల్లో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది వ్యవసాయశాఖ పంటల నమోదును పక్కాగా చేస్తోంది. ఏఈఓలు వానాకాలంలో రైతులు సాగు చేసిన పంటల చేలకు క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల వివరాలు, విస్తీర్ణం, ఏ పంట వేశారు, రైతు ఆధార్‌కార్డు నంబర్, ఫోన్‌ననంబర్ తదితర వివరాలను డీసీఎస్(డిజిటల్ క్రాప్ సర్వే) యాప్‌లో నమోదు చేస్తున్నారు. తొలుత పట్టా భూములలో పంట నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ఆ తర్వాత నాన్ డిజిటల్ సైన్ భూముల్లో సాగు చేసిన పంటల వివరాలను నమోదు చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
2.10 లక్షల ఎకరాలలో పత్తి సాగు
ఈ ఏడాది జిల్లాలో సుమారు 2.10 లక్షల ఎకరాలలో పత్తి, 1.85లక్షల ఎకరాలలో వరి సాగు చేశారు. మిర్చి, అపరాల సాగు ఇంకా కొనసాగుతోంది. అక్టోబర్ 25 వరకు పంటల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది, ఇప్పటికే జిల్లాలో 40శాతం మేర నమోదు పూర్తయింది. డిజిటల్ క్రాప్ సర్వేలో పంటలు నమోదు చేసుకుంటే సీసీఐలో పత్తి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు ఇబ్బందులు ఉండవు. గతేడాది చాలామంది రైతులు క్రాప్ బుకింగ్ చేసుకోకపోవటంతో పత్తి, ధాన్యం అమ్మకాల సమయంలో నానా అగచాట్లు పడ్డారు.
గతేడాది పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులు పత్తి విక్రయించుకునేందుకు వ్యవసాయశాఖ అధికారులు టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్)రాసి ఇచ్చారు. కొందరు ఏఈఓలు వ్యాపారులకు కూడా టీఆర్‌లు ఇవ్వడం, వాటిని మార్కెటింగ్‌శాఖ అధికారులు ధ్రువీకరించటంతో సీసీఐ పత్తి అమ్మకాల్లో అవకతవకలు జరిగాయి. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. కొందరు వ్యవసాయశాఖ అధికారులు, 17మంది మార్కెటింగ్‌శాఖ కార్యదర్శులపై సస్పెన్సన్ వేటు పడింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలు పరిశీలించాకే వివరాలు నమోదు చేస్తున్నారు. పంట నమోదు చేసుకుంటే పంటల బీమా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట నష్టం జరిగినప్పుడు పరిహారం అందించేందుకు వీలుంటుంది. పంట నమోదు చేసుకోకుంటే ఏ పథకాలకు కూడా అర్హులు కాలేరని అధికారులు చెబుతున్నారు.