
హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు
వరంగల్ లీగల్: స్నేహితుడిని హత్య చేసిన కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ తండాకు చెందిన పాల్తియా రమేశ్‌కు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి బి.అపర్ణాదేవి శుక్రవారం తీర్పు వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రాజమల్లారెడ్డి తెలిపిన వివరాలు... పాల్తియా రమేశ్, హనుమకొండ రాయపురకు చెందిన యంజాల శివ మిత్రులు. వీరిద్దరు పాత ఇనుప సామగ్రి, చిత్తు కాగితాలు, ఖాళీ సీసాలు విక్రయిస్తూ జీవిస్తుండగా డబ్బు పంపకాల్లో తేడాతో గొడవలు మొదలయ్యాయి. రమేశ్ బాల్యం నుంచే చోరీ కేసుల్లో వరంగల్, హైదరాబాద్, ఖమ్మం జైళ్లలో శిక్ష అనుభవించాడు. మళ్లీ వరంగల్ చేరుకొని శివను కలవగా, 2023 సెప్టెంబర్ 13వ తేదీన గొడవ పడగా, శివ నిద్రించేందుకు హనుమకొండలోని మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లాడు. అయితే, ప్రతిసారి తనతో గొడవ పడుతున్నాడని భావించిన రమేశ్.. కాసేపటికి శివ వద్దకు వెళ్లి విచక్షణరహితంగా కొట్టి బంగ్లా పైనుంచి కిందికి నెట్టేయడమే కాక కర్ర, బండరాళ్లతో కొట్టి చనిపోయాడని నిర్ధారించుకుని పారిపోయాడు. అనంతరం రమేశ్ పోలీసులకు లొంగిపోగా విచారణలో నేరం రుజువు కావడంతో రమేశ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు.
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
భద్రాచలంటౌన్: పట్టణంలోని కరకట్ట రోడ్డులో శుక్రవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. మృతుడి వయసు సుమారు 43 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఏడుగురిపై కేసు నమోదు
టేకులపల్లి: నకిలీ స్టాంపు పేపర్లు సృష్టించిన వ్యవహారంలో ఏడుగురు వ్యక్తులపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. బోడు ఎస్‌ఐ పొడిశెట్టి శ్రీకాంత్ కథనం ప్రకారం... లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన సోమరాజు వెంకట రాజా రాంప్రసాద్, అతని కుటుంబ సభ్యులకు సంపత్ నగర్ గ్రామం గంగారం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 303/2/157లో ఉన్న 70 ఎకరాల భూమి వారసత్వంగా సంక్రమించింది. ఆ భూమిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఏడుగురు వ్యక్తులు కలిసి నకిలీ స్టాంపు పేపర్లను మోసపూరితంగా సృష్టించారు. బాధితుడు వెంకట రాజా రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు మాళోతు నాగలక్ష్మి, భూక్య భావ్‌సింగ్, గుగులోత్ సక్కుబాయి, మాళోతు బలరాం, మెట్ల వెంకటేశ్వర్లు, ఏలూరి కోటేశ్వర్‌రావు, కోరం చిట్టిబాబులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం
ఇల్లెందురూరల్: మండలంలోని పూబెల్లి బీట్ ఆఫీసర్ రాణి శుక్రవారం ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యుల కథంనం ప్రకారం.. పూబెల్లి శివారులో కోతుల బెడద తగ్గించుకునేందుకు రైతు చేను పక్కనే చెట్లను తొలగిస్తుండగా బీట్ అధికారి అడ్డుకుంది. ఈ విషయంలో సదరు రైతు పురుగుల మందు తాగినట్లు గ్రామస్తులు ఆరోపించారు. నాటి నుంచి రాణి మానసికంగా ఒత్తిడికి గురవుతోంది. శుక్రవారం కుటుంబ సభ్యులు ఖమ్మంలో శుభ కార్యానికి వెళ్లగా ఆమె ఇంట్లో ఉన్న టాబ్లెట్లు మింగింది. గమనించిన బంధువులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇల్లెందు రేంజ్ అటవీసిబ్బంది, యూనియన్ నాయకులు కోటి, మురళి తదితరులు రాణిని పరామర్శించారు.