
అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
దమ్మపేట: అంతరాష్ట్ర గంజాయి ముఠాను శుక్రవారం దమ్మపేట పోలీసులు అరెస్ట్ చేశారు. దమ్మపేట స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్వంచ డీఎస్పీ సతీష్‌కుమార్ వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. దమ్మపేట పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి ఎస్సై సాయికిషోర్ రెడ్డి మండలంలోని పట్వారిగూడెం గ్రామ శివారులో శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో పాల్వంచ నుంచి దమ్మపేట వైపు వెళ్తున్న కారు అనుమానాస్పదంగా కనిపించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వాహనంలో తనిఖీ చేయగా రూ.43 లక్షల విలువైన 86 కేజీల గంజాయి లభించింది. కారులో ఎనిమిది మంది వ్యక్తులు ఉండగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు.
నిందితుల్లో సీఐఎఫ్‌ఎఫ్ కానిస్టేబుల్
పోలీసులు పట్టుకున్న ఐదుగురిలో ఏపీలోని మోతుగూడేనికి చెందిన పనగుడు శివకృష్ణ, తమిళనాడుకు చెందిన జయరామన్ మహేష్‌కుమార్, కృష్ణమూర్తి మారియప్పన్, కందసామి రంజిత్, రాము వసంత్ ఉన్నారు. వీరిలో శివకృష్ణ సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబు ల్. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై ఎన్‌డీఆర్‌ఎఫ్ పనిచేస్తూ కేరళలో నివాసం ఉంటున్నాడు. పరారైన వారిలో ఏపీలోని రాజమండ్రికి చెందిన ఓ మహిళ, ఒడిశా, తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. గంజాయి అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని డీఎస్పీ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఎస్సైతో పాటు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు వీర, లక్ష్మయ్య, రమేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.