సర్కారు సేవలకు సై! | - | Sakshi
Sakshi News home page

సర్కారు సేవలకు సై!

Sep 12 2025 6:13 AM | Updated on Sep 12 2025 6:13 AM

సర్కా

సర్కారు సేవలకు సై!

ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు, ఆపరేషన్లు జిల్లా నలువైపులా అందుబాటులో రక్త నిల్వ కేంద్రాలు సర్కారు దవాఖానాలపై పెరుగుతున్న నమ్మకం

అభివృద్ధి నిధుల జాడేది..?

నలువైపులా స్పెషాలిటీ సేవలు

మూడు రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటున్నా..

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. సర్కారు దవాఖానాల్లో వైద్యుల పోస్టులు భర్తీ చేయడం, రోగ నిర్ధారణ పరీక్షలు, శస్త్ర చికిత్సలు ఉచితంగా అందిస్తుండడంతో ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుండగా, పేషెంట్ల తాకిడి పెరుగుతోంది. వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవుతున్న ఐపీ, ఓపీ రికార్డులే అందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చర్ల సామాజిక ఆస్పత్రిలో నిన్నామొన్నటి వరకు 50 మంది వరకు ఓపీ రికార్డు ఉండగా ఇప్పుడది 220కి పెరిగింది. మణుగూరు ఏరియా ఆస్పత్రిలో ఈ ఏడాది జనవరిలో ఎనిమిది ప్రసవాలు మాత్రమే జరగగా, ఆగస్టు నాటికి ఆ సంఖ్య 100 దాటింది. గోదావరి తీరానికి రెండువైపులా ఉన్న ఆస్పత్రుల్లో గైనకాలజిస్ట్‌ సేవలు అందుబాటులోకి రావడంతో ఏజెన్సీ వాసులకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయి. అశ్వారావుపేట ఏజెన్సీలోనూ ఇదే తరహా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. దీంతో ఏజెన్సీలో ఆర్‌ఎంపీల దూకుడుకు బ్రేకులు పడుతున్నాయి.

శస్త్ర చికిత్సలూ అదే స్థాయిలో..

సాధారణ వైద్య సేవలకు తోడు ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు సైతం పెరిగాయి. భద్రాచలం ఆస్పత్రిలో ప్రతీ నెల సగటున 14 మందికి కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. పాల్వంచ, భద్రాచలం ఆస్పత్రుల్లో ఎముకలకు (ఆర్థోపెడిక్‌) సంబంధించి నెలకు 50 వరకు ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ కార్పొరేట్‌ ఆస్పత్రుల తరహాలో మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా ప్రారంభించారు. ఇల్లెందు ఆస్పత్రిలో ఫిజియోథెరపీ చికిత్స విజయవంతంగా నడుస్తోంది. ఇక్కడ నెలకు 200 మందికి పైగా ఫిజియోథెరపీ సేవలు పొందుతున్నారు. దంత విభాగంలోనూ జిల్లా వాప్తంగా ప్రతీ నెల 300 పైగా శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషాలిటీ సేవలు మెరుగవడంతో ఇక్కడ అందే వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. ఉదాహరణకు ఇల్లెందు ఆస్పత్రిని పరిశీలిస్తే ఇక్కడ 100 పడకలు ఉండగా గత నాలుగైదు నెలలుగా 120 మందికి పైగా ఇన్‌ పేషెంట్లు(ఐపీ) ఉంటున్నారు. దీంతో ఇక్కడ కొత్తగా ఆపరేషన్‌ థియేటర్‌ నిర్మాణానికి స్థలం దొకరని పరిస్థితి నెలకొంది.

రక్త నిల్వ కేంద్రాలు

గతంలో జిల్లాలో ఎక్కడ రక్తం అవసరమైనా కొత్తగూడెం, భద్రాచలం ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్తగా మణుగూరు, అశ్వారావుపేటలోనూ రక్త నిల్వ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో ఇల్లెందులోనూ ప్రారంభం కానుంది. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో కలిపి డయాలసిస్‌ కోసం 54 మిషన్లు అందుబాటులో ఉండగా 400 మందికి డయాలసిస్‌ చేసే వీలుంది. కాగా ప్రస్తుతం రోగుల సంఖ్య 350 లోపే ఉంది. అయితే స్పెషాలిటీ సేవలు అందించే వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో డాక్టర్ల సంఖ్య మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ అనూహ్యంగా డిమాండ్‌కు సరిపడా నర్సులు లేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికిప్పుడు జిల్లా వ్యాప్తంగా 90 మంది నర్సుల అవసరం ఉంది. మరోవైపు ఆస్పత్రుల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, డాక్టర్లకు సైతం గత నాలుగు నెలల నుంచి వేతనాలు అందడం లేదు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషాలిటీ వైద్య చికిత్సలు

రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు సబ్‌ సెంటర్ల నుంచి ఏరియా ఆస్పత్రుల వరకు వైద్య సిబ్బంది అహర్నిశలూ ప్రయత్నిస్తున్నారు. అయితే వీటికి అందాల్సిన ఆస్పత్రి అభివృద్ధి నిధులు(హెచ్‌డీఎఫ్‌) రెండు, మూడేళ్లుగా పెండింగ్‌లో ఉంటున్నాయి. ఈ నిధులు అందుబాటులో ఉంటే ఆస్పత్రుల్లో అసరమైన అత్యవసర మందుల కొనుగోలు, చిన్న చిన్న మరమ్మతులు చేయించే అవకాశం ఉంటుంది. ఏళ్లుగా హెచ్‌డీఎఫ్‌ నిధులు లేక ప్రతీ పనికి కలెక్టర్‌ అందించే ప్రత్యేక నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది.

ఏజెన్సీ జిల్లాల్లో గతంలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేవి కావు. ఏ జబ్బు చేసినా ఖమ్మం, కొత్తగూడెంపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రభుత్వ పరంగా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం.

– జి.రవిబాబు, డీసీహెచ్‌ఎస్‌

మూడు రోజులు క్రితం జ్వరం రావడంతో ఇల్లెందు ఆస్పత్రికి వచ్చా. పెద్ద డాక్డర్లు పరీక్షించి బెడ్‌ ఇచ్చారు. ఇప్పుడు జ్వరం తగ్గుముఖం పట్టింది. రోజూ గ్లూకోజ్‌ పెట్టి ఇంజెక్షన్లు వేస్తున్నారు. ప్రైవేట్‌లో అయితే రూ.10వేలకు పైగా ఖర్చయ్యేది. ఇక్కడ రూపాయి ఖర్చులేకుండా రోగం నయం చేస్తున్నారు.

– సీహెచ్‌ విజయ, రేపల్లెవాడ, ఇల్లెందు మండలం

సర్కారు సేవలకు సై!1
1/3

సర్కారు సేవలకు సై!

సర్కారు సేవలకు సై!2
2/3

సర్కారు సేవలకు సై!

సర్కారు సేవలకు సై!3
3/3

సర్కారు సేవలకు సై!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement