
వేతన వెతలు..
● ‘ఆశ్రమ’ వంట కార్మికులకు ఆరు నెలలుగా జీతాల్లేక ఇక్కట్లు ● గుదిబండగా మారనున్న జీఓ 64 ● ఉమ్మడి జిల్లాలో 490 మంది డైలీవేజ్ వర్కర్లు ● సమస్యల పరిష్కారానికి నేటి నుంచి సమ్మెబాట
కరకగూడెం: ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వంట కార్మికులు గత ఆరు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 64.. వారికి గుదిబండగా మారింది. దీంతో తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 60 ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న 490 మంది డైలీ వేజ్ కార్మికులు శుక్రవారం నుంచి సమ్మె బాట పట్టనున్నారు.
అసలే అరకొర.. అందులోనూ జాప్యం
ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న వంట కార్మికులకు చెల్లించే అరకొర వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్ ఉంటున్నాయి. దీంతో నిత్యావసరాలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 64 అమల్లోకి వస్తే తమ వేతనం సగానికి సగం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈజీఓ అమలైతే.. ప్రస్తుతం నెలకు రూ.26వేలు పొందే కార్మికుడి వేతనం.. రూ.11,700కు పడిపోవచ్చని తెలుస్తోంది. ఈ జీఓ అమలు చేయొద్దని, తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వద్ద కార్మికులు, ఆయా సంఘాల నాయకులు భారీ ఆందోళన చేసి, మంత్రి అట్లూరి లక్ష్మణ్‌కు వినతిపత్రం అందజేశారు. పాత వేతన విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో చేపట్టిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు శుక్రవారం నుంచి సమ్మె బాట పట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు ఐటీడీఏ అధికారులకు సమ్మె నోటీసు అందించారు. ఈ విషయమై ఐటీడీఏ డీడీ మణెమ్మను వివరణ కోరగా వేతనాలు చెల్లించడానికి నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ, కొత్త జీఓ ప్రకారం తీసుకునేందుకు కార్మికులు అంగీకరించడం లేదని తెలిపారు.
జీతాలు లేక అప్పుల పాలయ్యాం. ఆరు నెలలుగా జీతం ఆగిపోతే ఎలా బతకాలి. ఇప్పుడిస్తు జీతాలే సరిపోవడం లేదు. ఇక కొత్త జీఓ అమలైతే ఇంకా తగ్గుతాయని అంటన్నారు. పాత జీతాలు ఇవ్వడంతో పాటు కొత్త జీఓ రద్దు చేయాలి.
– కౌసల్య, డైలీవేజ్ కార్మికురాలు,
ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాల
గిరిజన ఆశ్రమ పాఠశాలల కార్మికుల కష్టాలు చెప్పలేనివి. ఆరు నెలల వేతనాలు పెండింగ్ ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆ జీతాలు ఇవ్వకపోగా ప్రభుత్వం కొత్త జీఓ తెచ్చి వారి పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోంది. కార్మికులకు అన్యాయం జరిగితే సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం.
–కె.బ్రహ్మచారి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు
ఆరు నెలలుగా జీతాలు లేవు. ఈ జీతంపైనే మా కుటుంబం ఆధారపడి ఉంది. ఎండాకాలమైనా, వానాకాలమైనా కష్టపడి విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నాం. ఇప్పుడిచ్చే వేతనాలే అరకొరగా ఉన్నాయి. ఇక కొత్త జీఓతో జీతాలు ఇంకా తగ్గుతాయంటున్నారు. ప్రభుత్వం మా గోడు విని న్యాయం చేయాలి.
– ముసలయ్య, డైలీవేజ్ కార్మికుడు,
చిరుమళ్ల ఆశ్రమ పాఠశాల

వేతన వెతలు..

వేతన వెతలు..

వేతన వెతలు..