భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువు దీరిన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి గురువారం అర్చకులు 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. ఆ తర్వాత హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, అర్చకులు, వేదపడింతులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
శరన్నవరాత్రుల ప్రచార రథం ప్రారంభం..
పెద్దమ్మతల్లి ఆలయంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల విజయంతానికి ప్రత్యేక రథం ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రథాన్ని పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో చెవుగాని పాపారావు, పెండ్లి రామిరెడ్డి, శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
22 నుంచి డీఎల్‌ఈడీ థియరీ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: ఈనెల 22 నుంచి 27 వరకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ద్వితీయ సంవత్సరం థియరీ పరీక్షలు జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయని, చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని వివరించారు. హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు 8919279238 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
జాతీయ స్థాయి టోర్నీకి ఉపాధ్యాయుడి ఎంపిక
దుమ్ముగూడెం : మండలంలోని ఆర్లగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు శ్యామల ఆంజనేయులు అలిండియా సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. ఈ నెల 9, 10 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన షటిల్ విభాగంలో అండర్ – 40 విభాగంలో ఆయన ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఆంజనేయులును గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కారం సర్వేష్, పూనెం నర్సింహారావు తదితరులు అభినందించారు.
‘ఆది కర్మయోగి’
వివరాలు సమర్పించాలి
భద్రాచలంఅర్బన్ : ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన వివరాలు, ప్రతిపాదనలు పంపించాలని ఏటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఐటీడీఏ కార్యాలయం నుంచి 19 మండలాల అధికారులు, నోడల్ అధికారులు, జిల్లా, మండల లెవెల్ మాస్టర్ ట్రైనింగ్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జిల్లాలో 19 మండలాల పరిధిలోని 130 గ్రామాల్లో ఆది కర్మయోగి అభియాన్ పథకంపై ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించిన కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన ఎలా ఉందనే వివరాలతో నివేదికలు సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పరిపాలన అధికారి రాంబాబు, లక్ష్మీనారాయణ, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం