
అమరుల త్యాగాలు మరువలేనివి
● సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ● హాజరైన ఎస్పీ రోహిత్‌రాజ్, డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్
చుంచుపల్లి: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. అటవీ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గొత్తిగోయల చేతిలో హత్యకు గురైన ఎఫ్‌ఆర్‌ఓ చలమల శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అడవులు వనరులు మాత్రమే కాదని, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువుగా నిలుస్తాయని చెప్పారు. అడవుల సంరక్షణలో ఉద్యోగుల కృషి ఎనలేనిదని అన్నారు. రాత్రీ పగలు తేడా లేకుండా, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్నారని అభినందించారు. ఎస్పీ రోహిత్‌రాజ్ మాట్లాడుతూ అటవీ సిబ్బందికి ఎదురవుతున్న సవాళ్ల విషయంలో పోలీస్ శాఖ అండగా నిలుస్తుందని తెలిపారు. అటవీ సిబ్బంది నిత్యం ప్రమాదాలు ఎదుర్కొంటూ అడవులను కాపాడుతున్నారని అన్నారు. డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్ మాట్లాడుతూ అమరుల త్యాగాలు తమకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. అంతకుముందు ప్రకాశం స్టేడియం నుంచి సెంట్రల్ పార్కు వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు కుటుంబసభ్యులు, వివిధ విభా గాల అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సెంట్రల్ మెడికల్ స్టోర్ తనిఖీ
రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని సెంట్రల్ మెడికల్ స్టోర్‌ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోగులకు అవసరమయ్యే ఔషధాలు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, ప్రధాన రహదారి నుంచి స్టోర్‌కు వచ్చే రోడ్డు మరమ్మతు చేయాలని, స్టోర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మందుల నిల్వకు ర్యాక్‌లు, బరువైన బాక్సులు ఎత్తడానికి అవసరమైన యంత్రాలు సమకూర్చాలని సిబ్బంది కోరగా త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట సీనియర్ ఫార్మసీ అధికారి శారద, ఫార్మసిస్ట్ రామచందర్ ఉన్నారు.