
దళిత బంధు యూనిట్ల తనిఖీ
జూలూరుపాడు: మండల కేంద్రంలో గతంలో మంజూరైన దళిత బంధు యూనిట్లను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరగిరి ప్రీతమ్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అడ్డగోలుగా ఇచ్చిందని, కొందరు లబ్ధిదారులు యూనిట్లను అమ్ముకున్నారని తెలిపారు. అలాంటి యూనిట్లను గుర్తించేందుకే తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం పలు పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఉపేందర్, దళిత బంధు లబ్ధిదారుడు మోదుగు రామకృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాళోత్ మంగీలాల్ నాయక్, నాయకులు గోపు రామకృష్ణ, పోతురాజు నాగరాజు, మెంతుల కృష్ణ పాల్గొన్నారు.
రామయ్యను దర్శించుకున్న ప్రీతమ్..
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో పూజల అనంతరం వేదాశీర్వచనం చేసి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. అనంతరం టూరిజం శాఖ హోటల్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విస్తృతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రీతమ్‌కు ఘన సన్మానం
సుజాతనగర్: ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్‌ను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రీతమ్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమములో ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పతి కుమార్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బొందయ్య, నాయకులు గద్దల రమేష్ పాల్గొన్నారు.