
టీఎల్‌ఎంతో సులభంగా..
విద్యార్థుల్లో నేర్చుకోవాలనే ఆసక్తి పెంపుదల దృశ్య, శ్రవణ అనుభూతితో దీర్ఘకాల జ్ఞాపకం
బోధనకు అనుకూలం
ఆసక్తి, అవగాహన పెరుగుతుంది
దమ్మపేట: టీఎల్‌ఎం(బోధన అభ్యసన సామగ్రి) వినియోగంతో బోధన, అభ్యాసన ప్రక్రియ మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఇటీవల జిల్లా వ్యాప్తంగా మండలాల స్థాయిలో టీఎల్‌ఎం మేళా నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేశారు. ఐటీడీఏ పరిధిలోని పాఠశాలలకు ఏటీడీఓ స్థాయిలో ఈ నెల 1న పార్కలగండి, ఇతర ప్రాంతాల్లో టీఎల్‌ఎం మేళా నిర్వహించారు. ఈ నెల 16న భద్రాచలం గిరిజన భవన్‌లో గిరిజన పాఠశాలలకు జిల్లాస్థాయి మేళా నిర్వహించనున్నారు. ఇతర యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలలకు మండలస్థాయిలో మేళాలు కొనసాగుతున్నాయి. మరో వారంలో వాటికి కూడా జిల్లాస్థాయి మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా..
ప్రధానంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠ్యాంశాల బోధనలో టీఎల్‌ఎంను వినియోగిస్తే బోధన సులభతరం అవుతుంది. విద్యార్థుల్లో ఆసక్తి కూడా పెంపొందుతుంది. ఈ క్రమంలో నమూనా చిత్రాలు, మ్యాపులు, బొమ్మలు, చార్టులు, దృశ్య, శ్రవణ పరికరాలతో ఉపాధ్యాయులు బోధన అభ్యసన సామగ్రిని రూపొందించి మేళాలో ప్రదర్శించారు. పార్కలగండి గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలకు నిర్వహించిన టీఎల్‌ఎం మేళాలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు తయారు చేసిన వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన బోధన అభ్యసన పరికరాలను పరిశీలించి అభినందించారు. టీఎల్‌ఎంను జోడించి బోధించడం ద్వారా విద్యార్థులకు నేర్చుకోవాలని ఆసక్తి పెరగడంతోపాటు దృశ్య అనుభూతి కలుగుతుందని తెలిపారు. టీఎల్‌ఎం తయారీతో ఉపాధ్యాయుల అంతర్గత ప్రతిభ కూడా బయటకు వస్తుందని పేర్కొన్నారు.
బోధన అభ్యసన సామగ్రి
బోధన ప్రక్రియను సులభతరం చేసి, విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఉపయోగపడే ప్రతీ వస్తువు, వనరు, పరికరం, సాధనం బోధన అభ్యసన సామగ్రిగా చెప్పవచ్చు. ఈ తరహా బోధనలో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య జరిగే బోధన అభ్యసన ప్రక్రియ మెరుగుపడుతుంది. వీటి ద్వారా ఉపాధ్యాయుడు బోధనను అత్యంత ప్రభావవంతంగా నిర్వహించవచ్చు. విద్యార్థులు కూడా చురుగ్గా నేర్చుకుంటారు. అభ్యసన ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. సమాచారం ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. విద్యార్థుల్లో ఆలోచన, విమర్శనాత్మక శక్తి పెరుగుతుంది. దృశ్య, శ్రవణ, దృశ్య–శ్రవణ సాధనాలను టీఎల్‌ఎం బోధనలో ఉపయోగిస్తారు. దృశ్య సాధనాలుగా చిత్రాలు, పోస్టర్లు, నమూనాలు, మ్యాపులు, బొమ్మలను ఉపయోగిస్తారు. శ్రవణ సాధనాలుగా ఆడియో టేపులు, పాటలు, కవితలు, ప్రసంగాలను వినియోగిస్తారు. దృశ్య–శ్రవణ సాధనాలుగా టెలివిజన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మల్టీమీడియా ప్రజెంటేషన్లను ఉపయోగిస్తారు.
టీఎల్‌ఎంతో ప్రయోజనాలు
●ఉపాధ్యాయుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది.
●విద్యార్థులకు అభ్యసన పట్ల సన్నద్ధతతో పాటు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది.
●ఇంద్రియ అనుభవాల ద్వారా ప్రత్యక్ష అనుభూతి కలుగుతుంది.
●దృశ్య, శ్రవణ పరికరాల ద్వారా నేర్చుకున్న పాఠ్యాంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి.
●తరగతి గదిలో అభ్యసన వాతావరణం మెరుగుపడుతుంది.
●కష్టతరమైన పాఠ్యాంశాలు నేర్చుకోవడం సులభతరం అవుతుంది.
●వాస్తవ ప్రపంచ పరిచయం, సమస్యల పరిష్కారం, ఆలోచనా శక్తి పెంపొందుతుంది.
●చదువులో వినోదాన్ని, ఆచరణాత్మకతను, అనుభూతిని కలిగిస్తుంది.
మెరుగుపడనున్న బోధన, అభ్యసన ప్రక్రియ
టీఎల్‌ఎం ద్వారా తరగతి గదిలో బోధనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు పాఠ్యాంశాలు నేర్చుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తారు. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు, సమగ్ర అభ్యసన సామర్థ్యాలు పెరుగుతాయి. అవగాహన, ఇంద్రియ అనుభవంతో నేర్చుకోవడం వల్ల పాఠ్యాంశాలు దీర్ఘకాలం గుర్తుంటాయి.
– విజయలక్ష్మి, ఉపాధ్యాయురాలు, మొద్దుల
గూడెం గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల
పాఠ్యాంశాల బోధనలో బోధన అభ్యసన సామగ్రిని ఉపయోగిస్తే విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తితోపాటు అవగాహన పెరుగుతుంది. బోధనలో దృశ్య, శ్రవణ సాధనాల వినియోగం వల్ల ప్రత్యక్ష అనుభూతి పెరిగి, కష్టతరమైన పాఠ్యాంశాలు కూడా సులభంగా అర్థమవుతాయి. టీచర్ల బోధన కూడా మెరుగుపడుతుంది.
– కీసర లక్ష్మి, ఎంఈఓ,
దమ్మపేట

టీఎల్‌ఎంతో సులభంగా..

టీఎల్‌ఎంతో సులభంగా..

టీఎల్‌ఎంతో సులభంగా..