
విద్యుత్ సిబ్బంది సాహసం
మద్దుకూరు సాగునీటి ప్రాజెక్ట్‌లో మరమ్మతులు
చండ్రుగొండ: మండలంలోని మద్దుకూరు సాగునీటి ప్రాజెక్ట్‌లో నుంచి వెళ్లే విద్యుత్‌లైన్ పిడుగుపాటుకు మరమ్మతులకు గురికాగా, గురువారం విద్యుత్ సిబ్బంది నీటిలోనే మరమ్మతులు పూర్తి చేశారు. మద్దుకూరు ప్రాజెక్ట్ మీదుగా మద్దుకూరులోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి చండ్రుగొండలోని 33/11 సబ్‌స్టేషన్‌కు స్టాండ్‌బై విద్యుత్ లైన్ ఉంది. బుధవారం పిడుగుపాటుకు ప్రాజెక్ట్ మధ్యలో విద్యుత్‌లైన్ ఇన్సులేటర్ తెగిపోయింది. దీంతో రెండు సబ్‌స్టేషన్ల మధ్య విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో సిబ్బంది దాదాపు 10 అడుగుల లోతులో నీటిలో ప్రయాణించి, తాడు మోకుల ద్వారా స్తంభం వద్దకు చేరుకుని మరమ్మతులు పూర్తి చేశారు. దీంతో పలువురు విద్యుత్ సిబ్బందిని అభినందించారు.
పోలీసు అదుపులో గంజాయి విక్రేతలు?
ఐదుగురు అనుమానితులను దమ్మపేటలో విచారిస్తున్న పోలీసులు!
అశ్వారావుపేట: మండలంలోని ఆసుపాక గ్రామం గంజాయి రవాణాకు హబ్‌గా మారిందని ప్రచారం సాగుతోంది. దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో సీఐ పింగళి నాగరాజు రెడ్డి ఆసుపాకకు చెందిన కొందరు వ్యక్తులను మూడు రోజులుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆసుపాకకు చెందిన ఓ వ్యక్తి 20 ఏళ్ల క్రితం భద్రాచలంలో గుమస్తాగా పని చేసేందుకు వెళ్లాడు. అక్కడ ఏర్పడ్డ పరిచయాలతో గుట్కా, ఖైనీ, గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గంజాయిని ఆసుపాకలో డంప్ చేసి ఇతర ప్రాంతాలకు వేరే వ్యక్తుల ద్వారా చేరవేసేవాడని తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో అశ్వారావుపేట పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. గురువారం అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో ఓ కారును స్వాధీనం చేసుకుని, ఇతర రాష్ట్రానికి చెందిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దమ్మపేట పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై సీఐ నాగరాజు రెడ్డిని సంప్రదించగా.. ప్రచారం వాస్తవం కాదని తెలిపారు.
ప్రహరీని ఢీకొట్టిన ట్రాక్టర్
గోడ కూలి వృద్ధురాలి మృతి
దమ్మపేట: ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రహరీ కూలి మీద పడి ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండలంలోని లచ్చాపురం గ్రామంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లచ్చాపురం గ్రామానికి చెందిన అబ్బిశెట్టి నారాయణమ్మ(65) తన ఇంట్లో లోపలవైపు ప్రహరీకి ఆనుకుని కూర్చుంది. ఈ క్రమంలో అశ్వారావుపేట మండలంలోని దిబ్బగూడెం గ్రామానికి చెందిన యువకుడు రావుల సాయి ట్రాక్టర్‌ను నిర్లక్ష్యంగా నడుపుతూ నారాయణమ్మ ఇంటి ప్రహరీని ఢీకొట్టాడు. దీంతో గోడ కూలి పడి ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
మణుగూరు టౌన్: తోగ్గూడెం ఆలయ సమీపంలోని సమ్మక్క–సారక్క ఫంక్షన్ హాల్‌లో గురువారం కొందరు పేకాట ఆడుతుండగా పోలీసులు దాడులు చేశారు. పేకాటరాయుళ్లు వట్ట రాంబాబు, చనుమోలు పూర్ణచంద్రరావు, నంబూరి శ్రీనివాసరావు, చావ సత్యనారాయణ, తాతా రమణ, శ్రీరామోజు అనంతరాములు, గుదే వెంకట్రావు, వెల్లంకి కిశోర్, గడ్డం మల్లికార్జునరావు, తోటకూర వెంకటేశ్వరరావు, బట్ట మేకల చంద్రశేఖర్, మాదినేని రాధాకృష్ణ, అడపా వెంకటేశ్వర్లు, కాసబోయిన శ్రీను, ఆరే నవీన్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నాగబాబు తెలిపారు. రూ.1.69 లక్షల నగదు, 15 సెల్‌ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.