
గందరగోళంగా ‘కేటీపీఎస్’ ఓట్ల లెక్కింపు
పాల్వంచ: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ (పాల్వంచ) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గందరగోళంగా మారింది. బుధవారం కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్‌ల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం వైటీపీఎస్, బీటీపీఎస్ నుంచి పోలింగ్ బాక్స్‌లను పాల్వంచకు తీసుకొచ్చారు. ఎన్నికల అధికారి గంగాధర్ ఆధ్వర్యంలో డీఏవీ పాఠశాలలో బుధవారం రాత్రి 9 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. గురువారం రాత్రి వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఫలితాల కోసం అభ్యర్థులు, ఉద్యోగులు కౌంటింగ్ కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఫలితాల్లో వెల్లడిలో తీవ్ర జాప్యం కావడం విమర్శలకు దారి తీసింది. తొలుత పోలిగ్ బాక్స్‌ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారని, అది ఎటూ తేలకపోవడంతో ఆ తర్వాత అన్ని బాక్స్‌లను ఒక్కచోట కలిపి మళ్లీ లెక్కింపు చేపడుతున్నారని పలువురు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం వరకు వెల్లడవుతుండగా కేటీపీఎస్ సొసైటీ ఫలితాలు మాత్రం 24 గంటలపాటు లెక్కించినా తేలలేదు. మొత్తం 2,996 ఓట్లకుగాను 2,543 ఓట్లు పోలుకాగా, ఆ ఓట్లను లెక్కించేందుకు అధికారులు హైరానా పడుతున్నారు.
ఆరుగురు డైరెక్టర్ల గెలుపు
ఎస్సీ మెన్ కేటగిరీలో వల్లమల్ల ప్రకాష్ 237 ఓట్లతో సొసైటీ డైరెక్టర్‌గా గెలుపొందినట్లు అధికారులు వెల్లడించారు. కేశులాల్, తోట అనిల్‌కుమార్, కోన నాగేశ్వరరావు, ఆర్. స్పందన, వీరస్వామి డైరెక్టర్లుగా విజయం సాధించారు. రాత్రి 10 గంటలు దాటినా మరో ఏడుగురి డైరెక్టర్ల ఫలితాలు వెల్లడి కాలేదు. కాగా విజేతలు, వారి మద్దతుదారులు రంగులు చల్లుకుని విజయోత్సవాలు నిర్వహించారు.
ఫలితాల కోసం పడిగాపులు కాసిన
ఉద్యోగులు, అభ్యర్థులు