
జెడ్పీలో తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తున్న అధికారులు
తుది జాబితా వెల్లడించిన అధికారులు
చివరి దశకు ప్రాదేశిక ఎన్నికల ఏర్పాట్లు
జిల్లాలో 1,271 పోలింగ్ కేంద్రాలు సిద్ధం
చుంచుపల్లి: జిల్లాలో జిల్లా, మండల పరిషత్ ఓటర్ల లెక్క తేలింది. మొత్తం 6,69,048 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,25,045 మంది, మహిళలు 3,43,979 మంది, ఇతరులు 24 మంది ఉన్నారు. ఈ మేరకు బుధవారం జెడ్పీ అధికారులు వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 2న జిల్లాలోని 471 గ్రామ పంచాయతీలు, 4,168 వార్డులకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా సిద్ధం చేశారు. ఆ ప్రకారమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటర్ల జాబితాపై అధికారులు కసరత్తు చేశారు. గత ఫిబ్రవరిలో ప్రచురించిన జాబితా కంటే ప్రస్తుత జాబితాలో 12,126 మంది ఓటర్లు తగ్గారు. జిల్లాలోని 233 ఎంపీటీసీ స్థానాలు, 22 జెడ్పీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
జిల్లా వ్యాప్తంగా 1,271 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండగా, ఇప్పటికే ఆర్‌వోలు, ఏఆర్‌వోలకు తొలి విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు గతేడాది ఆగస్టు మొదటి వారంతో ముగియటంతో ప్రత్యేకాధికారులను నియమించారు. మండల ప్రజా పరిషత్ పాలనను జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు, జిల్లా పరిషత్‌ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌ను ప్రత్యేక అధికారులుగా పర్యవేక్షిస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ అది ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో పరిషత్ ఎన్నికలు కొంత ఆలస్యమవుతాయనే ప్రచారం జరుగుతోంది. దసరా తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
రెండు విడుతలుగా..
జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు అధికారులు దాదాపు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల పరిధిలోని ఓటర్ల జాబితాలను, పోలింగ్ కేంద్రాలపై కసరత్తు చేశారు. ఈ నెల 6న పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల ముసాయిదా జాబితాను మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. 6 నుంచి 8 వరకు అభ్యంతరాలు, వినతులను స్వీకరించారు. 8న మండల, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 9న అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం జెడ్పీ అధికారులు బుధవారం తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను వెల్లడించారు. త్వరలో జరగనున్న ప్రాదేశిక ఎన్నికలను జిల్లాలో రెండు విడతలుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 22 మండలాలకు తొలుత 12 మండలాలు, తర్వాత 10 మండలాలకు పోలింగ్ జరగనుంది.
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. 22 జెడ్పీటీసీలు, 233 ఎంపీటీసీలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. తుది ఓటర్ల జాబితాలతో పాటు పొలింగ్ కేంద్రాలను సిద్ధంగా ఉంచాం. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా పోలింగ్‌కు సిద్ధంగా ఉన్నాం.
– బి.నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓ
మండలాల వారీగా ఓటర్ల వివరాలు ఇలా...
మండలం; పురుషులు; మహిళలు; ఇతరులు
ఆళ్లపల్లి; 4,641; 4,673; 0
అన్నపురెడ్డిపల్లి; 8,363; 8,569; 0
అశ్వాపురం; 16,069; 17,278; 0
అశ్వారావుపేట; 14,927; 15,770; 2
భద్రాచలం; 19,624; 21,136; 1
బూర్గంపాడు; 24,676; 25,673; 2
చండ్రుగొండ; 11,640; 12,214; 1
చర్ల; 15,686; 16,963; 4
చుంచుపల్లి; 18,743; 19,814; 5
దమ్మపేట; 21,288; 23,255; 0
దుమ్ముగూడెం; 17,370; 19,389; 3
గుండాల; 6,629; 6,701; 0
జూలూరుపాడు; 13,681; 14,303; 1
కరకగూడెం; 6,393; 6,476; 0
లక్ష్మీదేవిపల్లి; 15,845; 16,725; 1
మణుగూరు; 17,924; 18,556; 0
ములకలపల్లి; 13,887; 14,493; 0
పాల్వంచ; 13,972; 14,947; 2
పినపాక; 13,227; 14,122; 1
సుజాతనగర్; 7,109; 7,311; 1
టేకులపల్లి; 20,677; 21,391; 0
ఇల్లెందు; 22,674; 24,220; 0