
గ్రామాల్లో మళ్లీ ‘రెవెన్యూ’
176 మంది ఎంపిక
జిల్లాలో 204 క్లస్టర్లలో జీపీఓల నియామకానికి శ్రీకారం గతంలో పనిచేసిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏలకు అవకాశం బలోపేతం కానున్న గ్రామ రెవెన్యూ వ్యవస్థ
అంకితభావంతో సేవలు
ప్రజాసమస్యలను తీర్చే అవకాశం
గ్రామ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో గ్రామ పాలనకు పునర్‌వైభవం సంతరించుకోనుంది. గ్రామ పరిపానాధికారుల(జీపీఓ)ల నియామకంతో గ్రామస్థాయిలో రెవెన్యూ పాలన పునరుజ్జీవం పోసుకోనుంది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయిందని, దీని కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని 2020లో గత ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దుచేసింది. వీఆర్వో, వీఆర్‌ఏలను ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. దీంతో గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ కనుమరుగైంది. ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి రావాల్సి వస్తోంది. ఐదేళ్లుగా గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడ స్తంభించాయని భావించిన ప్రస్తుత ప్రభుత్వం తిరిగి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే జీపీఓల నియామకానికి శ్రీకారం చుట్టింది. దీంతో మళ్లీ గ్రామస్థాయిలో ప్రజలకు రెవెన్యూ సేవలు అందనున్నాయి. గతంలో వీఆర్‌ఓ, వీఆర్‌ఎలుగా విధులు నిర్వహించిన వారికి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌గా నిర్ణయించి, ఆసక్తి ఉన్న వారికి అర్హత పరీక్ష నిర్వహించారు. గతంలో జిల్లాలో 329 మంది వీఆర్‌ఏలు, 247 మంది వీఆర్‌ఓలు ఉండగా, వారిలో 176 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందులో 67 మంది వీఆర్‌ఏలు, 109 మంది వీఆర్‌ఓలు ఉన్నారు.
గ్రామస్థాయిలో కీలకం
జీపీఓలు గ్రామస్థాయిలో కీలకంగా మారనున్నారు. భూభారతి, రైతాంగ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రజలకు అండగా నిలవడం, ఓటర్ల జాబితాలో కీలకంగా వివిధ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ప్రాథమిక నివేదికలో విధులను నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితా తయారీలో కీలకంగా మారడంతో పాటు ఎన్నికల సమయంలో బీఎల్‌ఓలుగా వ్యవహరించనున్నారు.
జిల్లాలోని 23 మండలాల్లో 376 రెవెన్యూ గ్రామాలను 204 క్లస్టర్లుగా నిర్ణయించారు. ఆసక్తి ఉండి పరీక్ష రాసిన 176 మందితో పాటు మరో 18 మందిని అడిషనల్ జీపీఓలుగా ఎంపిక చేశారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఇంకా 10 మందిని జీపీఓలుగా నియమించాల్సి ఉంది. గత సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా జీరో సర్వీసుగా నిర్ణయిస్తారని జరుగుతున్న ప్రచారం కారణంగా కూడా కొందరు జీపీఓలుగా రాకుండా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
గతంలో నిర్వహించిన విధులను తిరిగి నిర్వహించే అదృష్టం రావడం సంతోషంగా ఉంది. ప్రజలకు అవసరమైన సేవలను అంకిత భావంతో అందిస్తాం. మాకు ఈఅవకాశం కల్పించిన ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు.
– కాక శ్రీను, జీపీఓల అధ్యక్షుడు
ప్రజలకు గ్రామస్థాయిలో సమస్యలను పరిష్కరించడానికి తిరిగి అవకాశం రావడం పునర్జన్మగా భావిస్తున్నాను. తిరిగి మా విధులను మేము నిర్వహించుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, అధికారులకు రుణపడి ఉంటాం. శాయశక్తులా ప్రజలకు మా సేవలను పారదర్శకంగా అందిస్తాం.
–పోడెం వరలక్ష్మి, జీపీఓల కోశాధికారి
గ్రామరెవెన్యూ వ్యవస్థ బలోపేతమవుతోంది. ప్రజలు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాలకు వ్యయప్రయాసలతో వచ్చే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం గ్రామస్థాయిలో జీపీఓల విధులను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం.
–డి.వేణుగోపాల్, అదనపు కలెక్టర్

గ్రామాల్లో మళ్లీ ‘రెవెన్యూ’

గ్రామాల్లో మళ్లీ ‘రెవెన్యూ’

గ్రామాల్లో మళ్లీ ‘రెవెన్యూ’