
మహిళా శక్తికి ప్రతీక.. ఐలమ్మ
సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్య సాహసంతో పోరాడిన చాకలి ఐలమ్మ మహిళా శక్తికి ప్రతీకగా నిలిచారని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, శ్రామిక జన విముక్తి కోసం ఐలమ్మ చాటిన పోరాటపటిమ నేటి తరాలకు స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి విజయలక్ష్మీ, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి శ్రీలత, బీసీ సంఘం నాయకులు అజిత్‌కుమార్, ముదిగొండ రాంబాబు, సర్వేష్, జంగంపల్లి రాజు, దురిశెట్టి కుమార్, విజయలక్ష్మి, కొదుమూరి సత్యనారాయణ, కాపర్తి వెంకటాచారి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
17 నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం)/చుంచుపల్లి: మహిళల ఆరోగ్యం సక్రమంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యవంతంగా నిలుస్తుందనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం స్వాస్థ్ నారీ–స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో స్వాస్థ్ నారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని రకాల ఆరోగ్య కేంద్రాల్లో సమగ్ర ఆరోగ్య సేవలు అందించాలని ఆదేశించారు. మారిన జీవనశైలి కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారని, శిబిరాల్లో వ్యాధుల నిర్ధారణ జరిగితే తగిన చికిత్స, అవసరమైన మందులు అందించవచ్చని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ, శక్తిమంతమైన కుటుంబ నిర్మాణం, సమాజాభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, డీసీహెచ్‌ఓ రవిబాబు, డీపీఓ చంద్రమౌళి, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా, మున్సిపల్ కమిషనర్‌లు సుజాత, శ్రీకాంత్ తదితరరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్