
వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
చుంచుపల్లి: వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రాంతీయ ఆస్పత్రులు మణుగూరు, ఇల్లెందు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు పాల్వంచ, చర్లలో మత్తు డాక్టర్లు, గైనకాలజీ, రేడియాలజీ, జనరల్‌సర్జన్, పిల్లల వైద్య నిపుణుల పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయనున్నట్లు డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయని, అభ్యర్థులు ఈ నెల 20లోపు కలెక్టరేట్‌లోని సూపరింటెండెంట్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. వివరాలకు 93472 77353 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
2,680 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా
ఖమ్మం, భద్రాద్రి,
మహబూబాబాద్ జిల్లాలకు పంపిణీ
ఖమ్మంవ్యవసాయం: చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే రేక్ పాయింట్‌కు బుధవారం ఐపీఎల్ కంపెనీకి చెందిన 2,680 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం సరఫరా చేసింది. ఈ ఎరువును ఖమ్మం జిల్లాకు 1,380, భద్రాద్రి జిల్లాకు 800, మహబూబాబాద్ జిల్లాకు 500 మెట్రిక్ టన్నుల చొప్పున పంపిణీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వ్యవసాయ శాఖ ద్వారా కూపన్లు జారీ చేసి యూరియా పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేయగా.. పోలీసు పహారాలో అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
లోక్ అదాలత్‌ను
సద్వినియోగం చేసుకోవాలి
కొత్తగూడెంటౌన్: ఈ నెల నెల 13న జిల్లా కోర్టులో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ సూచించారు. బుధవారం జిల్లా కోర్టులోని లైబ్రరీహాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో అందరూ సమన్వయంతో పని చేయాలని చెప్పారు. జిల్లాను ఉన్నత స్థానంలో తీసుకొచ్చేందుకు పోలీసు అధికారులు కృషి చేయాలని తెలిపారు.
మునగ సాగుతో ఆదాయం
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
బాబూరావు
టేకులపల్లి: మునగ సాగుతో అనేక లాభాలు ఉన్నాయని, రైతులు మునగ సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బాబూరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన టేకులపల్లిలో మునగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య విలువలు, పోషకాలు, ఔషధ గుణాలు ఉండటం వల్ల మునగకు మార్కెట్‌లో ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఆ తర్వాత శంభునిగూడెంలో డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారీని పరిశీలించారు. డ్రోన్ ద్వారా ఎకరానికి రూ. 300తో నానో యూరియా, పురుగుల మందు పిచికారీ చేయవచ్చని, తద్వారా కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చని చెప్పారు. డీపీడీ సరిత, ఏఓ నీరుడు అన్నపూర్ణ, ఏఈవోలు శ్రావణి, రమేష్ రైతులు పాల్గొన్నారు.