
రాముడి ఆదాయం రూ.1.52 కోట్లు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. ఆలయ ఈఓ దామోదర్ రావు ఆధ్వర్యంలో దేవస్థానంలోని హుండీలను తెరిచి చిత్రకూట మండపానికి తరలించారు. ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు లెక్కింపు చేపట్టారు. 72 రోజులకు రూ.కోటి 52 లక్షల 59 వేల 499ల నగదు, మిశ్రమ బంగారం 0.089 గ్రాములు, మిశ్రమ వెండి కేజీ వచ్చినట్లు ఈఓ తెలిపారు. యూఎస్ డాలర్లు 624, సౌత్రాఫికా ర్యాండ్స్ 450, ఆస్ట్రేలియా డాలర్లు 10, యూఏఈ దిరామ్స్ 10, కెనడా డాలర్లు 230, యూరప్ యూరోలు 30తోపాటు మరికొన్ని ఇతర దేశాల మాదక ద్రవ్యం వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం నగదును బ్యాంకర్లుకు అందజేవారు. లెక్కింపులో ఆలయ ఏఈవోలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కమనీయం... కల్యాణం
రామయ్య స్వామివారి నిత్యకల్యాణం బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
భద్రాచలంలో 72 రోజుల
హుండీ కానుకల లెక్కింపు