
పాఠశాలలకు ప్రోత్సాహకాలు
రేటింగ్ పద్ధతి..
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..
బాధ్యత పెరుగుతుంది
● జాతీయిస్థాయిలో ఎంపికై న పాఠశాలలకు రూ. లక్ష నగదు ● స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్‌తో సర్కారు స్కూళ్ల ఎంపికలు ● 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారుల వెల్లడి
కొత్తగూడెంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, అభివృద్ధి, విద్యార్థుల నైపుణ్యం, హరిత వాతావరణం ప్రమాణికాలుగా రేటింగ్, నగదు ప్రోత్సాహకం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్ పేరుతో దేశవ్యాప్తంగా 200 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో స్కూల్‌కు రూ.లక్ష నగదును ప్రోత్సాహకంగా అందించనున్నారు. సంబంధిత ఉపాధ్యాయులను మూడు రోజులపాటు దేశవ్యాప్త విహార కేంద్రాల సందర్శనకు తీసుకెళ్లనున్నారు.
ఇవీ అర్హతలు..
గతంలో స్వచ్ఛ పురస్కారాలు అందజేసే వారు. ప్రస్తుతం రేటింగ్ పేరుతో పురస్కారాలు అందించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సమాజంలో శుభ్రతపై అవగాహన పెంచడం, పాఠశాల ప్రాంగణాన్ని పచ్చదనం వైపు మలచడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, వ్యర్థాలను వర్గీకరించడం, నీటి వినియోగంలో మితవ్యయం పాటించడం, వర్షపునీటి సేకరణకు ఏర్పాట్లు, విద్యార్థుల్లో పర్యావరణ స్నేహపూర్వక అలవాట్లను పెంపొందించడం, స్వచ్ఛ విద్యాలయం, మరుగుదొడ్ల శుభ్రత, తాగునీటి సదుపాయం, తరగతి గదుల శుభ్రత, దినసరి పరిశుభ్రత కార్యక్రమాలు, పాఠశాలల్లో మొక్కల పెంపకం, విద్యుత్ పొదుపు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న పాఠశాలలను పరిశీలించి రేటింగ్ ఇవ్వనున్నారు. అర్హతలున్న పాఠశాలలు ఈ నెల 30 లోగా దరఖాస్తులను అందజేయాలి. జిల్లాలో అర్హతలు కలిగిన పాఠశాలలు ఎక్కువగానే ఉన్నాయని, ఆయా పాఠశాలలన్నీ దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.
కేటగిరీలు ఇలా...
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, సబ్బుతో చేతులు కడగడం, వినియోగం, నిర్వహణ, ప్రవర్తన మార్పు, సామర్థ్య నిర్మాణం, జీవన శైలిలో మార్పులు, పాఠశాలల్లోని నిర్మాణాలు, మరుగుదొడ్లు, నీటి వసతి, హరితావరణం, వ్యర్థాల నిర్వహణ, ఆరోగ్యకర వాతావరణం వంటి కేటగిరీలలో రేటింగ్ ఇవ్వనున్నారు. జిల్లాలో మొత్తం 1,685 పాఠశాలలు ఉన్నాయి. డీఈఓ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు 1,081, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు 310, సోషల్ వెల్ఫేర్ 09, మైనారిటీ వెల్ఫేర్ 07, బీసీ వెల్ఫేర్ 11, ఎయిడెడ్ 30, ప్రైవేట్ (అన్ ఎయిడెడ్) 223, జూనియర్ కళాశాలలు 14 ఉన్నాయి. ఇవన్నీ రేటింగ్ పరిధిలోకి రానున్నాయి.
0–50 మార్కులు: ఒక నక్షత్రం
51–74 మార్కులు: రెండు నక్షత్రాలు
75–80 మార్కులు: మూడు నక్షత్రాలు
81–89 మార్కులు: నాలుగు నక్షత్రాలు
90–100 మార్కులు: ఐదు నక్షత్రాలు
జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి ఆన్‌లైన్‌లోనే స్వీయ నివేదికలు సమర్పించాలి. రేటింగ్‌లో మెరుగైన పాఠశాలలకు జాతీయ స్థాయిలో ఎంపిక చేస్తారు. రూ. లక్ష ప్రోత్సాహక బహుమతి అందిస్తారు. రేటింగ్ ప్రక్రియలో పాల్గొనే పాఠశాలల ఆవరణ అందంగా పచ్చదనం, పరిశుభ్రతతో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
–బి. నాగలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి
గతంలో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ పేరుతో ఈ అవార్డులను ఇచ్చేవారు. ఈ సంవత్సరం నుంచి స్వచ్ఛ, హరిత విద్యాలయ రేటింగ్ పేరుతో అమలు చేస్తున్నారు. అవార్డుల వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో పాఠశాల పట్ల బాధ్యత పెరుగుతుంది. సమాజంలో స్వచ్చ భారత్ –హరిత భారత్ లక్ష్యాల సాధనకు తోడ్పడుతుంది.
–ఎస్‌కే సైదులు,
కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి