
రికార్డుల తనిఖీ
మణుగూరు రూరల్: మండల పరిషత్ కార్యాల య ప్రాంగణంలోని మెప్మా కార్యాలయాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎం.విద్యాచందన బుధవారం సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. మెప్మా ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. అనంతరం తోగ్గూడెంలోని సర్క్యూలేటరీ ఆక్వా సిస్టం, కొర్రమీను చేపల పెంపకం కేంద్రం, కూనవరంలో మునగ తోటను సందర్శించారు. మునగ సాగు వల్ల రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలి పారు. ఆ తర్వాత మున్సిపాలిటీ పరిధిలోని ఐకేపీ సంఘాల గోదాంను, ఎస్‌హెచ్‌జీ మహిళా సంఘాల సభ్యులకు దసరా కానుకగా అందించే చీరల పంపిణీ వ్యవస్థను పరిశీలించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఐకేపీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యక్రమాల అమలుపై అధి కారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ టి.శ్రీనివాసరావు, ము న్సిపల్ కమిషనర్ ప్రసాద్, ఎంపీఓ పి వెంకటేశ్వరరావు, అహ్మదుల్లా పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్
సరఫరా చేయాలి
పాల్వంచ: విద్యుత్ అంతరాయాలను తగ్గించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వినియోగ దారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని టీజీ ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) టి.మధుసూదన్ రావు సూచించారు. బుధవారం జెన్‌కో ట్రైనింగ్ సెంటర్‌లో విద్యుత్ సరఫరా–అంతరాయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ అంతరాయాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, విద్యుత్ నియంత్రికల నిర్వహణ, విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్‌లు, ప్రమాదాల నివారణపై తీసుకుంటున్న కార్యక్రమాలు, వినియోగదారులకు, రైతులకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది రక్షణ పరికరాలు ఉపయోగించాలని సూచించారు. ఎల్‌సీ యాప్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకుని విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్, జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ మహేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
హత్యాయత్నం
కేసు నమోదు
దమ్మపేట: భార్య మీద హత్యాయత్నం చేసిన భర్తపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ఏపీలోని ఏలూరు జిల్లా టీ.నర్సాపురం మండలం సోములపాలేనికి చెందిన మునీశ్వరికి మండలంలోని తాటిమల్లప్పగుంపునకు చెందిన వాడే బుజ్జిబాబుతో వివాహం జరిగింది. భర్త ప్రవర్తన సరిగాలేదని మునీశ్వరి గతంలోనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆమె భర్త నుంచి వేరుగా పుట్టింట్లోనే ఉంటోంది. దీంతో భార్యపై పగ పెంచుకున్న బుజ్జిబాబు బుధవారం మండలంలోని గండుగులపల్లి ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ ఎదుట పిల్లల కోసం వేచి చూస్తున్న భార్య మునీశ్వరిపై కొడవలితో దాడి చేశారు. దీంతో మెడపై, కుడి చేతికి గాయాలై రక్తస్రావం జరిగింది. చికిత్స నిమిత్తం ఆమెను ఏపీలోని జంగారెడ్డిగూడెం తరలించారు. బాధితురాలి సోదరి పోడియం సుంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.
ఇంకుడుగుంతలో
పడి చిన్నారి మృతి
సత్తుపల్లిరూరల్: ఇంటి ఆవరణలో ఉన్న ఇంకుడు గుంతలో పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘసటన సత్తుపల్లి మండలం సత్యంపేటలో చోటుచేసుకుంది. మండలంలోని రుద్రాక్షపల్లి పంచాయతీ సత్యంపేట గ్రామంలో సోయం శివ, సంధ్యారాణి దంపతుల సంవత్సరం వయసు గల కుమార్తె మోక్షదుర్గ.. మంగళవారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ మూతలేని ఇంకుడుగుంతలో పడింది. కుటుంబ సభ్యులు గమనించకపోవడతో కొద్ది సేపటికి చిన్నారి మృతి చెందింది. ఆ తర్వాత చిన్నారి కోసం వెదుకుతుండగా ఇంకుడుగుంతలో మృతదేహం కనిపించింది. కాగా, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్‌విజయ్‌కుమార్ బుధవారం సత్యంపేటకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి చిన్నారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రికార్డుల తనిఖీ

రికార్డుల తనిఖీ