
పిడుగుపాటుతో ముగ్గురు కూలీలకు అస్వస్థత
టేకులపల్లి: వరి చేనులో పని చేస్తున్న ముగ్గురు వ్యవసాయ కూలీలు బుధవారం పిడుగు పాటుతో అస్వస్థతకు గురయ్యారు. మండలంలోని ప్రెగళ్లపాడు పంచాయతీ తూర్పుగూడెం గ్రామానికి చెందిన ఈసం రాజమ్మ, కొడెం పాపమ్మ, గొగ్గెల శిరీష గ్రామం సమీపంలోని స్టేషన్‌బేతంపూడి గ్రామంలో వరి పొలంలో కలుపు తీసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం భారీ వర్షంతోపాటు వరి పొలంలో పిడుగు పడటంతో కూలీలు స్పృహ కోల్పోయి అస్వస్థతకు గురయ్యారు. వారిని రైతులు సమీపంలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయించారు.
పిడుగుపాటుకు
కూలిన పోర్టికో
సుజాతనగర్: మండలంలో బుధవారం సుమారు 3 గంటలపాటు భారీవర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాఘవాపురంలో తెల్లబోయిన పెద్ద శ్రీను ఇంటి పొర్టికో పిడుగుపాటుతో కూలిపోయింది. ఆర్‌ఐ కాంతారావు పరిశీలించి సుమారు రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వర్షం ప్రభావంతో మండల కేంద్రం చెరువును తలపించింది.
దొంగలకు దేహశుద్ధి
పాల్వంచరూరల్: కిన్నెరసాని వాగు ఒడ్డున, పంట పొలాల వద్ద ఉన్న వ్యవసాయ విద్యుత్ మోటార్లను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. మండలంలోని నాగారం గ్రామ శివారులో వ్యవసాయ విద్యుత్ మోటార్లతోపాటు ద్వి చక్రవాహనాల ఇంజన్లను చోరీ చేస్తుండగా మంగళవా రం రాత్రి స్థానికులు ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు పారిపోయాడు. నిందితులు బూర్గంపాడు పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు తేలడంతో వారిని బూర్గంపాడు పోలీసులకు అప్పగించినట్లు ఎస్‌ఐ సురేష్ బుధవారం తెలిపారు.
సైబర్ కేసు నమోదు
దమ్మపేట: దమ్మపేట పోలీసు బుధవారం సైబర్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని లచ్చాపురం గ్రామానికి చెందిన కంపాటి చిలకమ్మ(32) సెల్‌ఫోన్‌కు కొద్దినెలల క్రితం తక్కువ పెట్టుబడితో అధికంగా లాభాలు అర్జించవచ్చంటూ ఓ మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె పలు దఫాలుగా రూ.2,80,000 ఓ యాప్‌లో పెట్టుబడిగా పెట్టింది.
లాభాలు రాకపోవడంతో గత నెల 16న ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు మోసగాళ్ల బ్యాంకు ఖాతాలో రూ.80,264ను స్తంభింపజేశారు. బాధితురాలు బుధవారం స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.