
విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలి
మణుగూరు టౌన్/అశ్వాపురం: విద్యార్థినులకు చదువుతోపాటు పౌష్టికాహారం అందించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్ట్ అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. బుధవారం మణుగూరు మండలంలోని గుట్ట మల్లారంలో గిరిజన సంక్షేమ గురుకుల బాలి కల, జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. వంటగది, సామగ్రి, స్టోర్ రూంలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి మెనూ అమలుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. విషకీటకాలు సంచరించే అవకాశం ఉన్నందున రాత్రివేళ బయటకు రావొద్దని విద్యార్థులకు చెప్పారు. జీసీసీ కార్యాలయం నుంచి బియ్యం సరఫరాలో జాప్యం జరుగుతోందని ఉపాధ్యాయులు తెలుపగా, వెంటనే అధికారులతో మాట్లాడారు. కొందరు విద్యార్థులు వైరల్ ఫీవర్‌తో బాధపడుతుండగా పీహెచ్‌సీ వైద్యులతో మాట్లాడి చికిత్స అందించారు. అశ్వాపురం రైతువేదికలో నిర్వహించిన ఆది కర్మయోగి అభియాన్ పథకంలో భాగంగా నిర్వహించిన గ్రామస్థాయి అధికారుల శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలు గిరిజనులకు అందేలా మండల లెవల్ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మామిళ్లవాయి, తుమ్మలచెరువు, పాములపల్లి, గొందిగూడెం గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి పథకాల గురించి వివరించాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పలు అంశాలపై తహసీల్దార్‌తో చర్చించారు. ఆ తర్వాత తహసీల్దార్ డేవిడ్‌రాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మణిధర్, ఎంపీడీఓ రవీంద్రప్రసాద్, ఎంపీఓ ముత్యాలరావు, తదితరులు పాల్గొన్నారు.