
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కరకగూడెం: మండలంలోని చిరుమల్ల రాయనిపేట గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, బుధవారం గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు పొలకమ్మతోగు గ్రామానికి చెందిన ఊకే ప్రసాద్ (35)గా గుర్తించారు. గతంలో తల్లిదండ్రులు మృతి చెందగా, భార్య కూడా వదిలివెళ్లిందని బంధువులు తెలిపారు. కుటుంబ సమస్యలు, ఒంటరితనం, మద్యం అలవాటు కారణంగా తీవ్ర మనస్తాపం ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎస్సై పీవీఎన్‌రావు కేసు నమోదు చేశారు.
ఎల్సిరెడ్డిపల్లిలో వ్యక్తి..
పినపాక: మండల పరిధిలోని ఎల్సిరెడ్డిపల్లి పంచాయతీ డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయంలో నివాసముంటున్న చెంచు వీరబాబు (40) పవర్ ప్లాంట్‌లో ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధసాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు పిల్లలు కాగా భార్య ఎనిమిది సంవత్సరాల క్రితమే మృతి చెందింది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
పాల్వంచలో ఆర్టిజన్ కార్మికుడు..
పాల్వంచ: ఆర్టిజన్ కార్మికుడి ఆత్మహత్యపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాత పాల్వంచ గడియ కట్టకు చెందిన కేటీపీఎస్ గ్రేడ్–4 ఆర్టిజన్ రెండేళ్లుగా గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో గత మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా పాత పాల్వంచ డౌన్‌లో బీసీఎం రోడ్ పక్కన పురుగుల మందు తాగి పడిపోయి ఉన్నాడు. ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. మృతుడి భార్య శివలక్ష్మి ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేశారు.