
యూరియా పక్కదోవ పట్టిందని ఆందోళన
పాల్వంచ: కో ఆపరేటివ్ సొసైటీ సిబ్బంది యూరి యా బస్తాలను పక్కదోవ పట్టించారని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. బుధవారం సొసైటీ కార్యాలయం నుంచి నుంచి 15 బస్తాల యూరి యాను ఆటోలో ఎక్కించి మహబుబాబాద్‌కు పంపించే ప్రయత్నం చేస్తుండగా స్థానిక రైతులకు అనుమానం వచ్చి ఆందోళన చేపట్టారు. యూరియా కోసం వచ్చిన వ్యక్తి స్థానికుడు కాదంటూ వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరును నిరసిస్తూ బీసీఎం రహదారిపై నిరసన తెలిపారు. దీంతో సీఐ సతీష్‌కుమార్, ఎస్‌ఐ సుమన్‌లు అక్కడికి చేరుకుని ఆటోను స్టేషన్‌కు తరలించారు. రైతులను శాంతింపజేశారు.
ఆత్మకమిటీ టెక్నికల్ అసిస్టెంటే సూత్రధారి?
యూరియా బస్తాల అక్రమ తరలింపునకు ఆత్మకమిటీ టెక్నికల్ అసిస్టెంట్ సూత్రధారి అని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. బుధవారం అతని తండ్రి ఓ ఆటోను పాల్వంచ సొసైటీకి పంపించగా, బిల్లులు లేకుండా 15 యూరియా బస్తాలో ఆటోలో ఎక్కించాడు. రైతులు గమనించి ఆందోళన చేపట్టడంతో పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అప్పటికప్పుడు సదరు వ్యక్తి కార్యాలయం నుంచి బయటకు వెళ్లి దొంగ బిల్లులు సృష్టించి తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. సిబ్బంది సహకారంతో టెక్నికల్ అసిస్టెంట్ అక్రమంగా యూరియా తరలించినట్లు తెలిసింది. ఈ విషయమై సీనియర్ అసిస్టెంట్ లక్ష్మిని వివరణ కోరగా.. యూరియా బస్తాలను స్లిప్‌ల ప్రకారం ఇచ్చామని, అవి ఎక్కడికి తీసుకెళుతున్నారనే విషయం తమకు సంబంధం లేదన్నారు. ఎస్‌ఐ సుమన్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.