
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై నిర్లక్ష్యం తగదు
మణుగూరు రూరల్: కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించిందని, ఆ ప్రాజెక్ట్‌పై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. బుధవారం బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం కూలిపోతుందంటూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిషన్ కావాలనే తప్పుడు నివేదికలను ప్రకటించిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లల్లో రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రాజెక్టుల నిర్మాణానికి పెట్టుబడిగా పెడితే, 20 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2.50లక్షల కోట్లకు పైగా అప్పు చేసి ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కావాలనే కుట్రలు పన్నుతున్నాయని, రానున్న రోజుల్లో ప్రజలే ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
అసత్య ఆరోపణలు మానుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్, పోశం నర్సింహరావు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, వట్టం రాంబాబు,నూకారపు రమేష్, వేర్పుల సురేష్, అక్కి నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు