
‘డబుల్’ కష్టాలు..
మానసిక ఒత్తిడితో ప్రమాదాలు..
డబుల్ డ్యూటీలతో
టిమ్ డ్రైవర్ల అవస్థలు
పనిభారంతో సతమతం
వారం రోజుల్లో 8 మందికి అస్వస్థత
అదనపు డ్రైవర్ లేదా కండక్టర్‌ను ఇస్తేనే హైదరాబాద్ వెళ్తామంటున్న డ్రైవర్లు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఆర్టీసీ డిపోలో కండక్టర్ లేకుండా టికెట్ ఇష్యూ మిషన్ (టిమ్)తో డ్రైవింగ్ చేస్తున్నవారి పరిస్థితి అధ్వానంగా మారింది. డబుల్ డ్యూటీ (కండక్టర్, డ్రైవర్) చేయాలంటే ఇబ్బందిగా ఉందని, ఏకాగ్రత కోల్పోతున్నామని వారు తెలిపారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు వెళ్లే టిమ్ సర్వీసులకు అదనపు డ్రైవర్ లేదా కండక్టర్‌ను ఇస్తే కానీ వెళ్లమని సోమవారం డ్రైవర్లు విధులను బహిష్కరించారు. సుమారు 10 సర్వీసులకు టిమ్ డ్రైవర్లు వెళ్లకుండా డిపో వద్దే ఉన్నారు. ఈ సర్వీసులతో తాము తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నామని, అనారోగ్యం పాలవుతున్నామని వాపోయారు. ఇప్పటికే వారం రోజులుగా 8 మంది సర్వీసులకు వెళ్లివచ్చి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని, ఇప్పటికే ఆర్టీసీ డీఎం తిరుపతికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని చెబుతున్నారు. డ్రైవర్లు వెళ్లకపోవడంతో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి పది గంటల వరకు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన బస్సులు ఆగిపోయాయి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఒక డ్రైవర్ ఆరున్నర గంటలు నిరంతరాయంగా పనిచేసిన తర్వాత ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ భద్రాచలం ఆర్టీసీ డిపో అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని టిమ్ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా.. పలు కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతున్న వ్యక్తిని సేప్టీ డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించడంపై ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. తమ సమస్యను పరిష్కరించే వరకు విధులు బహిష్కరించి డిపోలోనే ఉంటామని చెబుతున్నారు.
టిమ్‌తో ఇబ్బందులు ఇవే..
భద్రాచలం డిపో పరిధిలో 101 బస్సు సర్వీసులు నడుస్తుండగా, ఇందులో 79 ప్రభుత్వ బస్సులు కాగా, 22 ప్రైవేట్ బస్సులున్నాయి. వీటిల్లో టిమ్ (టిక్కెట్ ఇష్యూ మిషన్) డ్రైవర్లు పనిచేసే 25 బస్సులున్నాయి. డిపో పరిధిలో ఉన్న బస్సులకు 185 మంది డ్రైవర్లతోపాటు 163 మంది కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం డిపో నుంచి హైదరాబాద్‌కు–17, మంచిర్యాల–3, తిరుపతి–1, శ్రీశైలం–1, విజయవాడ–1, విశాఖపట్నం–2 టిమ్ బస్సులను నడుపుతున్నారు. బస్టాండ్‌లో నిలిపి టిక్కెట్ కొట్టడం వల్ల ప్రయాణానికి ఆలస్యమవుతోంది. టికెట్ మరిచిపోతే ఉద్యోగం ఎక్కడ పోతుందోనన్న ఆందోళన ఉంటోందని, ప్రయాణికుడు టికెట్ తీసుకోకపోయినా డ్రైవర్‌పై క్రమశిక్షణ చర్యలు ఉంటున్నాయని, బస్సు ఎక్కడైనా దెబ్బతిన్నా డ్రైవర్లే ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోతున్నారు. డ్రైవింగ్‌పై ఏకాగ్రత కోల్పోతున్నామని, ఉద్యోగ భద్రతకు గ్యారెంటీ ఉండదని పేర్కొంటున్నారు. డ్రైవరు ఒక్కరే ఉండటం వల్ల లగేజీ ఏం వేస్తున్నారో చూసుకోవడం కష్టమని చెబుతున్నారు.
కండక్టర్ లేకుండా టికెట్లు ఇచ్చుకుంటూ.. ప్రయాణికులను పర్యవేక్షిస్తూ.. లోపల పరిశీలిస్తూ బస్సు నడపాలంటే భయపడుతున్నారు. అందరూ టికెట్ తీసుకున్నారా? లేదా? అని, దిగాల్సిన ప్రయాణికులను చూసుకుంటూ పనిచేయాలంటే ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. బస్సు నడిపే సమయంలో ఒత్తిడికి గురైతే ఏకాగ్రత కోల్పోయి ప్రమాదాలు జరిగే అవకాశాలుఉన్నాయి.
ఆర్టీసీ డ్రైవర్లు టిమ్ సర్వీసులు నడపాలనే ఆదేశాలు ఉన్నతాధికారుల నుంచి వచ్చాయి. అది నా పరిధిలో ఉండేది కాదు. ఉన్నతాధికారుల
ఆదేశాల మేరకు మాత్రమే మేము నడుచుకుంటున్నాం. డ్రైవర్లపై కక్షపూరితంగా వ్యవరించడం లేదు. డ్రైవర్లతో పాటు నేను కూడా ఉన్నతాధికారుల వద్దకు సమస్యను తీసుకెళ్లేందుకు సహకరిస్తాను. –తిరుపతి, భద్రాచలం ఆర్టీసీ డీఎం

‘డబుల్’ కష్టాలు..

‘డబుల్’ కష్టాలు..