
పారదర్శకతకు శ్రీకారం !
● లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ ● లబ్ధిదారుడే యాప్ ద్వారా ఫొటోలు అప్‌లోడ్
అర్హత గలవారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాం. లబ్ధిదారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఇళ్లు నిర్మించుకోవాలి. మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని నిరంతరం సమీక్షిస్తున్నాం. ఎవరైనా లంచం అడిగినా, ఇబ్బందులకు గురి చేసినా టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి.
– శ్రీనివాసరావు, మణుగూరు ఎంపీడీఓ
మణుగూరు టౌన్: పేదల సొంతింటి కల నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టగా మొదటి విడతలో నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడక్కడా బిల్లుల మంజూరు కోసం లబ్ధిదారుల నుంచి అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ విషయంలో పారదర్శకత పాటించేందుకు లబ్ధిదారులే నేరుగా యాప్‌లో నిర్మాణ ఫొటోలు అప్‌లోడ్ చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా, క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, ఇబ్బంది పెట్టినా టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 5991కు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
అప్‌లోడ్ ఇలా..
లబ్ధిదారుడు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేశాక మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి ఓటీపీని ఉపయోగించాలి. ఇంటి నిర్మాణం ప్రతిదశలో స్పష్టమైన ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత ఫొటోలు ప్రభుత్వ సర్వర్‌కు చేరాక అధికారుల పరిశీలన అనంతరం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా బిల్లులు జమవుతాయి.
అక్రమాలకు చెక్..
ఇంతకుముందు మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు, పంచాయతీల్లో కార్యదర్శులు లబ్ధిదారుల ఇంటి నిర్మాణాల ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేసేవారు. సోమవారం నుంచి ప్రభుత్వం ఈ అవకాశం నేరుగా లబ్ధిదారులకే కల్పించడంతో అక్రమాలకు చెక్ పెట్టినట్టయింది.

పారదర్శకతకు శ్రీకారం !