
కమ్యూనిజానికి అంతం లేదు..
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని ● సురవరం సంస్మరణ సభలో పలువురి నివాళి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కమ్యూనిజానికి అంతం లేదని.. కమ్యూనిస్టులకు మరణం లేదని.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో మంగళవారం సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభను పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా అధ్యక్షతన నిర్వహించారు. సురవరం చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్, పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యతో పాటు పలు పార్టీల నాయకులు నివాళులర్పించారు. సురవరం జీవితం తెరచిన పుస్తకమని, విద్యార్థి దశ నుంచే కమ్యూనిజాన్ని నమ్మి నిరంతర పోరాటాలు చేశారని కూనంనేని సాంబశివరావు కొనియాడారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి స్థాయికి ఎదిగారన్నారు. పదునైన ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్లడమే సుధాకర్‌రెడ్డికి అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. 2026 మార్చి వరకు మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమీత్‌షా ప్రకటించడం సమంజసం కాదని, మావోయిస్టు ప్రతి రక్తపు బొట్టు నుంచి తిరిగి ఉద్భవిస్తారని వ్యాఖ్యానించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, మాస్‌లైన్ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు, కంచర్ల చంద్రశేఖర్‌రావు, కనగాల అనంతరాములు, సంకుబాపన అనుదీప్, పసుపులేటి వీరబాబు, వీరహనుమంతరావు, రామనాథం, మురళి తదితరులు పాల్గొన్నారు.