
యువకుడి ఆత్మహత్యాయత్నం
పాల్వంచరూరల్: కుటుంబ కలహాల కారణంగా ఓ యువకుడు పంట చేను వద్ద గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని ఉల్వనూరు లక్ష్మీదేవిపల్లికి చెందిన బి.ప్రసాద్ (35) మంగళవారం పంట చేను వద్ద గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఉల్వనూరు ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు లేకపోవడంతో ద్విచక్రవాహనంపై పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో కొత్తగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.
అంబులెన్స్ ఉండి కూడా..
కాగా, ఉల్వనూరు ఆస్పత్రిలో అంబులెన్స్ ఉన్నా దానిని నడిపే డ్రైవర్ అందుబాటులో లేడు. యువకుడు గడ్డిమందుతాగి ఆస్పత్రికి వస్తే అంబులెన్స్ డ్రైవర్‌తోపాటు వైద్యులు కూడా లేకపోవడంతో ద్విచక్రవాహనంపై యువకుడిని సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి తీసుకెళ్లారు. అంబులెన్స్, వైద్యులు ఉన్నా.. లేకపోయినా ఒకటేనని బాధితులు వాపోయారు. అధికారులు అంబులెన్స్ డ్రైవర్‌ను 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
తూరుబాకలో చోరీ..
దుమ్ముగూడెం: మండలంలోని తూరుబాక గ్రామానికి చెందిన నిమ్మకంటి కోటేశ్వరి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు సోమవారం చోరీకి పాల్పడారు. కోటేశ్వరి ఖమ్మం వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి రూ.25 వేల విలువగల బంగారం, రూ.6 వేల విలువ గల కిరాణా సామగ్రి చోరీ చేయడంతో పాటు రూ.48 వేల విలువ గల టీవీని ధ్వంసం చేశారు. సోమవారం రాత్రి 11 గంటలకు ఇంటికి చేరిన కోటేశ్వరి ఇంట్లో చిందరవందరగా పడి ఉన్న సామగ్రిని గమనించి, చోరీ జరిగినట్లు గుర్తించి మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.