
ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యం
ఎర్రుపాలెం: మారుమూల గ్రామాల్లోని ప్రజల అవసరాలు తీరుస్తూ, మౌలిక వసతులు కల్పించి జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో భట్టి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే 50ఏళ్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలు చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. తద్వారా రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మధిరను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈకార్యక్రమాల్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎర్రుపాలెం మండలంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని అయ్యవారిగూడెం, ఎర్రుపాలెం, పెద్దగోపవరం, బనిగండ్లపాడు బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల్లో రూ.4 కోట్ల ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. బనిగండ్లపాడులో భోజన విరామం అనంతరం ఖమ్మం కలెక్టర్ అనుదీప్, పీఆర్ ఎస్‌ఈ వెంకటరెడ్డి, డీపీఎ ఆశాలత, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకోబు, విద్యుత్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, తహసీల్దార్ ఉషాశారదతో అభివృధ్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. ఇక బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలోని ఇనద్రమ్మ చెరువును కలెక్టర్ అనుదీప్, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్‌లతో కలిసి డిప్యూటీ సీఎం పరిశీలించారు. అక్కడకు వెళ్లే రహదారి ఇటీవల వర్షాలతో బురదమయంగా మారడంతో ట్రాక్టర్‌పై వెళ్లారు.