
యూరియా కోసం వచ్చి సొమ్మసిల్లిన రైతు
అశ్వారావుపేటరూరల్: యూరియా బస్తాలు తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ గిరిజన రైతు సొమ్మసిల్లి పడిపోయిన ఘటన అశ్వారావుపేట మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జెట్టివారిగూడేనికి చెందిన జెట్టి సింగరాజు నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. పంటకు అవసరమైన యూరియా కోసం నారాయణపురంలోని సహకార సంఘం కార్యాలయానికి సోమవారం రాగా, సిబ్బంది మంగళవారం రావాలని చెప్పడంతో వెళ్లాడు. అప్పటికే చుట్టు పక్కల గ్రామాల నుంచి మరికొందరు రైతులు రావడంతో క్యూలైన్ ఏర్పాటు చేశారు. సింగరాజు గంటకు పైగానే నిలబటంతో ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడే ఉన్న ఐరన్ కుర్చీ తగిలి చెవి భాగంలో స్వల్ప గాయమైంది. తోటి రైతులు సింగరాజును సమీపంలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు.