
తప్పని యూరియా తిప్పలు
● తెల్లవారకముందే బారులుదీరుతున్న అన్నదాతలు ● సత్యనారాయణపురంలో సొమ్మసిల్లిన రైతు
సుజాతనగర్/అశ్వాపురం/చర్ల/టేకులపల్లి : జిల్లాలో యూరియా కోసం రైతుల కష్టాలు తప్పడం లేదు. విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారకముందే బారులు దీరుతున్నారు. ఎక్కువ సేపు క్యూలో నిల్చోలేక చెప్పులు, పట్టాదారు పాస్ పుస్తకాలను వరుసక్రమంలో పెట్టి చెట్ల కింద సేద తీరుతున్నారు. చర్ల మండలం సత్యనారాయణపురం పీఏసీఎస్ వద్ద గంటల తరబడి క్యూలో నిల్చున్న ఓ గిరిజన రైతుకు మూర్చ రాగా సొమ్మసిల్లి పడిపోయాడు. తిప్పాపురం గ్రామానికి చెందిన వృద్ధ రైతు కారం సోమయ్య.. తనకు ఇచ్చిన కూపన్‌తో క్యూలో నిల్చోగా ఒత్తిడి పెరగడంతో సొమ్మసిల్లగా అధికారులు, సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అశ్వాపురం మండలం మొండికుంట పీఏసీఎస్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయమే భారీగా క్యూ కట్టారు. ఏఓ మహేష్‌చంద్ర చటర్జీ అక్కడికి చేరుకుని ఉన్న నిల్వలను రైతులందరికీ సమానంగా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. సుజాతనగర్ సొసైటీ కార్యాలయంలో యూరియా నిల్వలు లేకపోయినా ఆధార్ కార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలను క్యూలో పెట్టి రైతులు వేచి చూశారు. వారం, పది రోజులుగా తిండీ, తిప్పలు మానుకొని తిరుగుతున్నామని, బస్తా యూరియా కోసం అరిగోస పడుతున్నామని రైతులు వాపోయారు. టేకులపల్లిలోనూ గంటల తరబడి క్యూలైన్లో నిల్చునా బస్తా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ కార్యాలయం తెరవకముందే అక్కడికి చేరుకుని చెప్పులు లైన్‌లో పెట్టి చెట్టుకింద కూర్చున్నారు. దీంతో సిబ్బంది ఉదయం 7 గంటలకే తాళాలు తీసి యూరియా పంపిణీని ప్రారంభించారు. ఎకరం ఉన్న వారికి ఒకటి, అంతకంటే ఎక్కువ ఉన్నవారికి రెండు బస్తాలు చొప్పున పంపిణీ చేస్తున్నట్లు ఏఓ నీరుడు అన్నపూర్ణ తెలిపారు.

తప్పని యూరియా తిప్పలు