
పరిశోధనల దిశగా ముందుకు సాగాలి
విద్యార్థులకు కలెక్టర్ సూచన
కరకగూడెం: విద్యార్థులు పరిశోధన దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం ఆయన కరకగూడెంలోని నవోదయ విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. వ్యక్తిగత లక్ష్య సాధనతో పాటు దేశాభివృద్ధికి తోడ్పడే దిశగా చదవడం, పరిశోధనలు చేయడం ముఖ్యమని, సమాజ సమస్యలకు పరిష్కారం చూపే శాస్త్రవేత్తలుగా తయారు కావాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత డైనింగ్ హాల్‌ను పరిశీలించి దోమలు, ఈగలు రాకుండా మెష్ ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కూరగాయలు, పెరుగు వంటివి నిల్వ చేసేందుకు ఫ్రిడ్జ్ అవసరమని సిబ్బంది కోరగా వెంటనే ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గంటా ప్రతాప్, ఎంఈఓ మంజుల, ఆర్‌ఐ కృష్ణప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ భాస్కరాచారి, ఉపాధ్యాయులు నయనాదేవి, చంచల్, అనిత, స్టాఫ్ నర్స్ రాధిక పాల్గొన్నారు.
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి..
చుంచుపల్లి: త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా అన్ని పార్టీల వారు సహకరించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కోరారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారాల కోసం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సోమవారం ఆయన ఐడీఓసీలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త ఓటర్ల నమోదుకు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని, నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త పేర్లు చేర్పులు ఉండవని స్పష్టం చేశారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డిప్యూటీ జెడ్పీ సీఈఓ చంద్రశేఖర్, ఆయా పార్టీల నాయకులు బాల ప్రసాద్, అనుదీప్, ఎస్.శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, నోముల రమేష్, రాంబాబు పాల్గొన్నారు.
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
మణుగూరు రూరల్ : ప్రభుత్వం కల్పించే అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని కలెక్టర్ పాటిల్ సూచించారు. మణుగూరు ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీని సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఐటీఐలను ఆధునికీకరించి ఏటీసీలుగా ఏర్పాటు చేశామని, వీటిలో శిక్షణ పొందిన విద్యార్థులకు పారిశ్రామిక రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ టి.శ్రీనివాసరావు, ఎంపీఓ పి.వెంకటేశ్వరరావు, ఐటీఐ సూపరింటెండెంట్ జ్యోతిరాణి, ఏటీఓలు కృష్ణారావు, వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం ప్రారంభం
అశ్వాపురం: మండలంలోని మిట్టగూడెం గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాలలో ఖమ్మం, వరంగల్, భద్రాద్రి జిల్లాల ఎన్‌సీసీ శిక్షణా శిబిరాన్ని కలెక్టర్ జితేష్ సోమవారం ప్రారంభించారు. క్యాంప్ కమాండెంట్ కల్నల్ సంజయ్‌కుమార్ భద్ర, క్యాంప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ నవీన్‌యాదవ్‌తో మాట్లాడి శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలపై చర్చించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మణిధర్, ఎంపీడీఓ రవీంద్రప్రసాద్, ఎంపీఓ ముత్యాలరావు, ఏఎన్‌ఓలు తారాచంద్, నాగులు, సిబ్బంది శేఖర్‌బాబు, ప్రశాంత్, ప్రభాకర్ పాల్గొన్నారు.