
ఉమ్మడిగా సర్వే నిర్వహిస్తాం
అశ్వారావుపేటరూరల్: గత కొన్నేళ్లుగా వివాదం నెలకొన్న ఫారెస్టు, రెవెన్యూ భూములపై త్వరలోనే ఉమ్మడి సర్వే చేపడతామని కొత్తగూడెం ఆర్డీఓ మధు తెలిపారు. మండలంలోని రామన్నగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 30,36,39 లోగల భూములపై రెవెన్యూ, అటవీ కార్పొరేషన్ అధికారులు, గ్రామస్తులతో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం సమావేశం నిర్వహించారు. భూములకు సంబంధించి గిరిజనుల వద్ద ఉన్న పూర్వ పట్టాదారు పాసు పుస్తకాలు, ఇతర పత్రాలు, ఫారెస్టు, రెవెన్యూ రికార్డులు, మ్యాప్‌లను పరిశీలించారు. అనంతరం భూ వివాదాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఉమ్మడి సర్వే చేస్తామని తెలిపారు. ఇందుకు గిరిజనులు కూడా అంగీకరించారు. ఈ సమావేశంలో ఎఫ్‌డీవో దామోదర్ రెడ్డి, సత్తుపల్లి, కొత్తగూడెం ఎఫ్‌డీసీ డీఎంలు గణేష్, చంద్రమోహన్, తహసీల్దార్ సీహెచ్‌వీ రామకృష్ణ, సత్తుపల్లి జోన్–1 ప్లాంట్ మేనేజర్ బ్రహ్మాచారి, ప్లాంట్ మేనేజర్ చంద్రకళ, సీఐ నాగరాజు, ట్రైనీ ఎస్సై అఖిల పాల్గొన్నారు.
కొత్తగూడెం ఆర్డీఓ మధు