
రైతులకు యూరియా సరఫరా చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): పంటలకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తొలుత నవభారత్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ కన్వీనర్ కెచ్చెల రంగారెడ్డి, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అమర్లపూడి రాము మాట్లాడుతూ అధిక వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేల నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. పోడు భూముల్లో పంటలు తొలగించిన అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.10,075 చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్రా వెంకన్న, కల్లూరి కిషోర్, మాచర్ల సత్యం, భానోత్ ధర్మ, జి.వెంకటేశ్వర్లు, పి.వీరబాబు, ఎన్ నాగేశ్వరరావు, ఆర్ వెంకటేశ్వర్లు, నూపా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.