ఐదుగురికి స్వల్ప గాయాలు
అశ్వాపురం: మండల పరిధిలోని మిట్టగూడెం గ్రామంలో మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై సోమవారం ఆర్‌టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. మణుగూరు డిపోకు చెందిన బస్సు ఖమ్మం వెళ్తుండగా ఇటుక లోడ్‌తో ట్రాక్టర్ మణుగూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో మిట్టగూడెం వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి ట్రాక్టర్ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు దిగి గుంతలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ వడ్డె రాజయ్య, కండక్టర్ జిల్లేపల్లి రవీంద్రచారితో పాటు ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రమబద్ధీకరించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా బస్సు కండక్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.
63 కిలోల గంజాయి స్వాధీనం?
జూలూరుపాడు: నిషేధిత గంజాయిని అక్రమంగా ఓ వాహనంలో తరలిస్తుండగా సోమవారం జూలూరుపాడు పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. మండలంలోని మాచినేనిపేటతండా గ్రామ శివారులో జూలూరుపాడు ఎస్‌ఐ బాదావత్ రవి, పోలీస్ సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా కొత్తగూడెం వైపు నుంచి హైదరాబాద్ వెళుతున్న బొలెరో వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌తోపాటు, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇద్దరి నుంచి సుమారు 63 కిలోల గంజాయి ప్యాకెట్లు పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇసుక లారీ సీజ్
దమ్మపేట: అనుమతులు లేకుండా ఆంధ్రా నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు సోమవారం సీజ్ చేశారు. మండలంలోని ముష్టిబండ గ్రామ శివారులో లారీని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేశామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.

ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ