
బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): అన్నపురెడ్డిపల్లిలోని జ్యోతిబాపూలే గురుకులం విద్యార్థులు రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల ఖమ్మం జిల్లా బోనకల్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి ఎంపికల్లో విద్యార్ధులు ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న విద్యార్థులు శ్రీహరి, ఎం.రఘురాం, ధనుష్, కే.వినయ్, ఎం.చరణ్, ఐ.జానకీరాంలను ప్రిన్స్‌పాల్ ఎస్కే బురాన్, ఏటీపీ శ్రీకాంత్, డిప్యూటీ వార్డెన్ మధు, పీడీ డాక్టర్ రఘువరన్, ఇతర అధ్యాపకులు సోమవారం అభినందించారు.
రేపు వాహనాల వేలం
పాల్వంచ: వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈ నెల 10న వేలం వేయనున్నట్లు పాల్వంచ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ సీఐ ఎం.ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆటో, ద్విచక్ర వాహనాలకు వేలం వేస్తామని, ఆసక్తి కలిగినవారు ఉదయం 10.30 గంటలకు ఎకై ్సజ్ స్టేషన్‌లో హాజరు కావాలని కోరారు.
రెండు ఇళ్లల్లో చోరీలు
చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి, మద్దుకూరు గ్రామాల్లో ఆదివారం రాత్రి రెండు ఇళ్లల్లో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్‌ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. తిప్పనపల్లి గ్రామానికి చెందిన ప్రైవేటు వైద్యుడు ఎస్కే బషీర్ ఈ నెల 6న భార్యతో కలిసి ఖమ్మంలో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లాడు. తలుపు పగులగొట్టి ఉండటంతో పక్కింటివారు గమనించి సమాచారం ఇచ్చారు. సోమవారం వచ్చి చూడగా బీరువాలో ఉంచిన బంగారం, రూ. 12 వేలు నగదు చోరీకి గురైంది. మద్దుకూరు గ్రామానికి చెందిన చాపల వసంత ఆదివారం రాత్రి ఇంటి ముందు ఆలయంలో నిద్రపోయింది. సోమవారం ఉదయం ఇంటికి చేరుకుని పరిశీలించగా బీరువాలో రూ. లక్ష నగదు చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.